హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): మన అడుగులో కేంద్రం అడుగు వేస్తున్నది.. మనం చేస్తున్న పనులను.. కాపీ కొడుతున్నది.. ప్రజల కోసం మనం ప్రారంభించిన పథకాలను.. కేంద్రం జిరాక్స్ తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న అనేక పథకాలను ఇప్పుడు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా కొత్త పేర్లతో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. సరిగ్గా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీకొడుతున్నది. ఒకప్పుడు అనేక అంశాల్లో వెనుకబడిన తెలంగాణ.. నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
మన మిషన్భగీరథే.. జల్‌జీవన్ మిషన్ పథకం
తెలంగాణలోని ప్రతి ఇంటికీ పైపులైన్ల ద్వారా సురక్షితమైన మంచినీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకాన్నే అచ్చంగా కాపీ కొట్టిన కేంద్రం జల్‌జీవన్ మిషన్ పథకం తెచ్చింది. ‘హర్‌ఘర్ నల్..హర్ ఘర్జల్..’ అంటూ ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తామంటూ బడ్జెట్లో కేటాయింపులు చేసింది.
భూ రికార్డుల డిజిటలైజేషన్.. స్ఫూర్తి మన ధరణి
కేంద్రం భూరికార్డుల ప్రక్షాళనకు తీసుకున్న డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రాం తెలంగాణకు కొత్తదేమీ కాదు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి.. ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూరికార్డుల ప్రక్షాళన చేపట్టింది.
ఆహారశుద్ధి కేంద్రాల ప్రాధాన్యతను ముందే గుర్తించాం
స్థానికంగా పండిన పంటలకు గిట్టుబాటు కల్పించి కల్తీలేని ఆహార పదార్థాలను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆహారశుద్ధి కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో ఏకీభవించినట్టు ఈ బడ్జెట్ తేటతెల్లం చేసింది. దేశవ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్ సెక్టార్‌కు ప్రోత్సాహం అందించనున్నట్టు పేర్కొన్నది.
తెలంగాణ తరహాలో వ్యవసాయ యాంత్రీకరణ
గత వార్షిక బడ్జెట్లో తెలంగాణ సర్కార్ రూ.1500 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు కేటాయించడం ద్వారా ఆ రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. వ్యవసాయ యాంత్రీకరణవైపు రైతును మళ్లించేలా చర్యలు తీసుకున్నది. ఇప్పుడు అదే విధానాన్ని ఆదర్శంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇచ్చినట్టు విశ్లేషకులు చెప్తున్నారు.
తెలంగాణలో ఇప్పటికే ఐఏఎంసీ ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్(ఐఏఎంసీ)సెంటర్ రెండు నెలల క్రితమే ప్రారంభమైంది. త్వరితగతిన, వివాద పరిష్కార వేదికగా ఈ సెంటర్ ఉపయోగపడుతున్నదని స్వయంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ వెల్లడించారు. ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికే ఆదర్శంగా నిలిచింది. తాజాగా గుజరాత్‌లోనూ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర సర్కార్ ఏర్పాటు నిర్ణయాల వద్దనే ఉంటే.. తెలంగాణ సర్కార్ పని ప్రారంభించింది.
అన్నిరంగాల్లో తెలంగాణ మేటి
తెలంగాణ అనేక రంగాల్లో దేశంలోనే మే టి రాష్ట్రంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే నివేదిక ప్రశంసించింది. ప లు అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న ఆరు పెద్ద రా ష్ర్టాల సరసన తెలంగాణ నిలిచిందని పేర్కొన్నది. సీఎం కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథ పథకం ద్వారా వంద శాతం గృహాలకు నల్లాల ద్వారా సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కితాబిచ్చింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో వందకు 69 శాతం స్కోర్‌తో తెలంగాణ రికార్డు సృష్టించింది. కార్మిక సంస్కరణలను అమలుచేయడంలో, వేతనాలపై ముసాయిదా నిబంధనలు తెలియజేసిన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. పారిశ్రామిక సంబంధాలపై ముసాయిదా నియమాలను నోటిఫై చేసిన రాష్ట్రంగా కూడా తెలంగాణ నిలిచినట్టు ఆర్థిక సర్వే పేర్కొన్నది. పలు లక్ష్యాల సాధనలో తెలంగాణ కొన్నింటిలో ఫ్రంట్న్న్రర్గా, ఫెర్ఫార్మర్ స్టేట్‌గా, ఆస్పిరెంట్ స్టేట్‌గా నిలిచిందని పేర్కొంది. స్థూల రాష్ట్ర విలువల ఆధారిత (జీఎస్విఎ) సేవల రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ర్టాల కంటే మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా 2019-20కి ముందున్న సేవలు క్రమేపి క్షీణించినప్పటికీ తెలంగాణపై అంతగా ప్రభావం చూపలేదని పేర్కొన్నది. సేవలు క్షిణించిన శాతం తెలంగాణలో కేవలం 3.94 శాతం కాగా రాజస్తాన్‌లో 11 శాతం, జార్ఖండ్, పంజాబ్‌లో 10 శాతం ఉంది. శిశు మరణాల రేటులో జాతీయ సగటు 35.2 కాగా, తెలంగాణలో 26.4 మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నది. ఐదేండ్లలోపు పిల్లల మరణాలలో జాతీయ సగటు 41.9 శాతం కాగా తెలంగాణలో ఇది 29.9 శాతం మాత్రమే. అలాగే నవజాత శిశు మరణాల రేటు జాతీయంగా 24.9 శాతం కాగా తెలంగాణలో 20.0 శాతం మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నది. వంట కోసం స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉపయోగించే గృహాలలో కూడా తెలంగాణ రాష్ట్రం మెరుగ్గా ఉన్నట్టు ఆర్థిక సర్వే నివేదికలో పేర్కొంది.