హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ పురోగతిలో భాగస్వామ్యం అవుతున్న తెలంగాణకు చెందిన ఎన్నారైలను ఆయన అభినందించారు. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ (ఎన్జడ్టీసీఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా, దీపావళి ఉత్సవాలతోపాటు తెలంగాణ దశాబ్ది సంబురాలను ఘనంగా నిర్వహించారు. అక్లాండ్లో జరిగిన ఈ వేడుకలకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నారైలతో కలిసి బతుకమ్మ ఆడారు. వండర్ గర్ల్స్ సంస్కృతి గ్రూప్, అనురాధ సూల్ ఆఫ్ డ్యాన్స్ బృందంతో కలిసి ఆడిపాడారు. తెలంగాణ జానపద, బాలీవుడ్ సినీపాటలతో ఉత్సవాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా హిప్కిన్స్ మాట్లాడుతూ న్యూజిలాండ్‌లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైల తల్లిదండ్రుల కోసం దీర్ఘకాలిక వీసా పాలసీని రూపొందిస్తామని చెప్పారు. తాను భారత్‌లో పర్యటించే సందర్భం వస్తే తప్పకుండా తెలంగాణకు వెళ్తానని వెల్లడించారు. న్యూజిలాండ్ కమ్యూనిటీ మినిస్టర్ ప్రియాంక రాధాకృష్ణన్ తెలంగాణ సమాజంతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని క్రిస్తోపాటు మంత్రి ప్రియాంకకు ఎన్జడ్టీసీఏ వ్యవస్థాపకుడు కల్యాణ్‌రావు కాసుగంటి రాజన్న సిరిపట్టు శాలువాను బహూకరించారు. తెలంగాణ కళాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న నీతా విజయ్‌కి ‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ ఇన్స్పైర్’ అవార్డును అందజేశారు. ఐశ్వర్య కోకా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యంతం అలరించాయి. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ దంతాలసహా న్యూజిలాండ్‌లో ఉన్న తెలంగాణ ఎన్నారైలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.