హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ కోర్సుల్లో భాషలు (లాంగ్వేజెస్)కు క్రెడిట్స్ తగ్గింపు నిర్ణయంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి యూటర్న్ తీసుకున్నది. ఈ నిర్ణయంపై మండలి సమీక్షిస్తున్నది. ఇదే అంశంపై వర్సిటీల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నది. రాష్ట్రంలో డిగ్రీ కోర్సులను ప్ర స్తుతం 150 క్రెడిట్లతో నిర్వహిస్తున్నారు. ఇటీవలే యూజీసీ 120 క్రెడిట్లకు కుదించాలని ఆదేశాలిచ్చింది. ఉన్నత విద్యామండలి డిగ్రీలో 124 క్రెడిట్లకు ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా మొదటి భాష, రెండోభాష క్రెడిట్లకు భారీగా కోత పెట్టింది. ఇది వరకు మొదటి భాషకు 20, రెండో భాషకు 20 చొప్పున క్రెడిట్లు ఉండేవి. వాటికి 12 క్రెడిట్ల చొప్పున ప్రతిపాదించింది. అంటే ఒక్కో భాషలో 8 క్రెడిట్లు కోతపెట్టింది. ఈ ప్రతిపాదనలను తెలుగు భాషాభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉన్నత విద్యామండలి అధికారులను కలిసి క్రెడిట్లకు కోతపెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. క్రెడిట్ల తగ్గింపుపై మండలి పునరాలోచన చేస్తున్నది. అధికారిక సమాచారం మేరకు 12 నుంచి 16కు పెంచనున్నట్టు తెలిసింది. భాషాభిమానులు మా త్రం 20కి పెంచాలని కోరుతున్నారు.