మంత్రి -ఎమ్మెల్యే తిట్ల దండకం
ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ సాక్షిగా తెలంగాణ పరువును కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గంగలో కలిపారు. ఢిల్లీ ఆందోళనలో పాల్గొంటామని వెళ్లిన నేతలు పార్టీ పదవుల విషయంలో సోయిమరచి బూతులు తిట్టుకున్నారు. మంత్రి, ఎమ్మెల్యే ‘నువ్వెంత.. అంటే నువ్వెంత’ అన్నట్టుగా చెలరేగిపోయారు. మంత్రి ఒకడుగు ముందుకేసి ‘నాతో పెట్టుకుంటే’.. ‘ఎక్కువ మాట్లాడితే’.. ‘పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే’ ఇదే హోటల్ రూములో పడేసి కొడ్తా బిడ్డా’ అంటూ హెచ్చరించినట్టు తెలిసింది.
- ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బూతుల రచ్చ
- హోటల్ లాబీలో మంత్రి దామోదర, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వాగ్వాదం
- కామారెడ్డి, సంగారెడ్డి డీసీసీ పదవులపై రగడ
- కొట్టుకున్నంత పనిచేసిన మంత్రి, ఎమ్మెల్యే
- నీ అంతు చూస్తా.. నీ కుటుంబాన్ని ఖతం చేస్తానని మంత్రి దామోదర బెదిరించిండు
- బూతులు తిట్టడమూ కెమెరాలో రికాైర్డెంది
- పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ సాక్షిగా తెలంగాణ పరువును కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గంగలో కలిపారు. ఢిల్లీ ఆందోళనలో పాల్గొంటామని వెళ్లిన నేతలు పార్టీ పదవుల విషయంలో సోయిమరచి బూతులు తిట్టుకున్నారు. మంత్రి, ఎమ్మెల్యే ‘నువ్వెంత.. అంటే నువ్వెంత’ అన్నట్టుగా చెలరేగిపోయారు. మంత్రి ఒకడుగు ముందుకేసి ‘నాతో పెట్టుకుంటే’.. ‘ఎక్కువ మాట్లాడితే’.. ‘పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే’ ఇదే హోటల్ రూములో పడేసి కొడ్తా బిడ్డా’ అంటూ హెచ్చరించినట్టు తెలిసింది.
ఎమ్మెల్యే కూడా అదే స్థాయిలో మంత్రిపై విరుచుకుపడినట్టు చెప్పారు. హస్తినలో తెలంగాణ పరువు తీసిన కాంగ్రెస్ మంత్రి, ఎమ్మెల్యే తీరు ఇప్పుడు పార్టీలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయమే ఘటన జరిగినా సాయంత్రం వరకు బయటకు రాలేదు. సాయంత్రం ఎమ్మెల్యే పలువురు సన్నిహితులకు జరిగింది చెప్పుకొని బాధపడటంతో విషయం మరింత బయటకు పొక్కింది. సన్నిహితుల సలహా మేరకు ఆ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌కు చెప్పినట్టు తెలిసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లినట్టు సమాచారం.
కామారెడ్డి డీసీసీ పీఠం కోసం వైరం
నిరుడు నవంబర్‌లో కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఏలె మల్లికార్జున్‌ను నియమించారు. దీనిని కామారెడ్డి జిల్లాలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు డీసీసీ ఎంపికలో కీలకపాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతున్నది. డీసీసీ అధ్యక్షుడిగా ఏలె మల్లికార్జున్ నియామకాన్ని ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా వ్యతిరేకించారు. అయితే, వీరెవ్వరితో సంబంధం లేకుండా పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడి మల్లికార్జున్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.
డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి గతంలో పార్టీలో పనిచేయలేదని, కాంగ్రెస్‌లో కొత్తగా చేరాడని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. కొత్తగా చేరిన వ్యక్తికి డీసీసీ పీఠం ఎలా ఇస్తారంటూ పార్టీ అధిష్ఠానానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. మల్లికార్జున్ డీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి పాత కాంగ్రెస్‌కు చెందిన నేతలు గుర్రుగా ఉన్నారు. వీరు విషయాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి కూడా గతంలో తీసుకెళ్లారు. ఇటీవల సెప్టెంబర్‌లో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పటోళ్ల చంద్రశేఖర్‌రెడ్డిని నియమించారు. ఈయన నియామకంపైనా దామోదర తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది.
సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఉజ్వల్‌రెడ్డిని నియమించాలని మంత్రి దామోదరతోపాటు స్థానిక నేతలు కూడా ప్రయత్నించారు. ఉజ్వల్‌రెడ్డి కోసం దామోదర సంతకాల సేకరణ కూడా చేపట్టారు. స్థానిక కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్ల నుంచి సిఫార్సు లేఖలు కూడా సంపాదించి పార్టీ అధిష్ఠానానికి పంపించారు. అయితే, అనూహ్యంగా పటోళ్ల చంద్రశేఖర్‌రెడ్డికి డీసీసీ పీఠం దక్కింది. ఇది కూడా దామోదరకు మింగుడుపడలేదు. ఉజ్వల్‌రెడ్డికి డీసీసీ పదవి రాకుండా అడ్డుకున్నారని పలువురు ఎమ్మెల్యేలపై దామోదర కోపంగా ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎల్లారెడ్డి, జుక్కల్ శాసనసభ నియోజకవర్గాలు కూడా ఉంటాయి. సంగారెడ్డిలో తాను ప్రతిపాదించిన వ్యక్తికి కాకుండా మరోవ్యక్తికి సహకరించారనే కోపంతోనే మంత్రి దామోదర.. జుక్కల్ ఎమ్మెల్యేపై చిందులు తొక్కారనే చర్చ నడుస్తున్నది.
లొల్లి మరింత ముదిరే అవకాశం
మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మధ్య తలెత్తిన వ్యవహారం ఇప్పుడప్పుడే తేలేలా కనిపించడంలేదు. ఇది మరింత ముదిరే అవకాశం కనిపిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ వద్దకు పంచాయితీ వెళ్లినా ఆయనకు దామోదరతో మాట్లాడే ధైర్యం ఉండదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం వద్దకు పంచాయితీ వెళ్లే అవకాశం ఉన్నదని, కేసీ వేణుగోపాల్ లేదా మరెవరైనా సీనియర్లు రంగంలోకి దిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
పచ్చి బూతులు తిట్టిండు : లక్ష్మీకాంతారావు
‘ఆదివారం ఉదయం పదిన్నరకు హోటల్ షాంగ్రిల్లాలో మంత్రి దామోదరను కలిసిన. నమస్కారం చేసేందుకు దగ్గరికి వెళ్లిన. వెళ్లిన వెంటనే ‘ఏంది నీ పేరు చాలా వినబడుతున్నది. ఏమనుకుంటున్నవ్? నిన్ను బొంద పెట్టేస్తా.. చాలా ఎగురుతున్నవ్. ఎవడికిపడితే వాడికి డీసీసీలు ఇప్పించుకుంటున్నవ్. నిన్ను బతుకనివ్వ.. నిన్ను, నీ ఫ్యామిలీని ఖతం చేస్తా.. అర్ధగంట నిన్ను రూములో వేసి పగులగొడితే నీకు అర్థమైతది’ అంటూ మంత్రి తనను బూతులు తిట్టాడని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు చెప్పారు. ఆయన సోమవారం పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనను మంత్రి అకారణంగా దూషించారని వెల్లడించారు. తొలుత తనకు అర్థం కాలేదని, మంత్రి స్వరం బీభత్సంగా పెరిగిందని, చెప్పలేని విధంగా బూతులతో తనను, తన కుటుంబాన్ని తిట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.
పార్టీ అధిష్ఠానాన్నీ వదలలే
మంత్రి కాంగ్రెస్ పార్టీని, అధిష్ఠానాన్నీ నోటికి వచ్చినట్టు తిట్టారని ఎమ్మెల్యే వెల్లడించారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక గురించి ఆయన ప్రస్తావించారని, కాంగ్రెస్‌లో ఉండే పద్ధతేందో 40 ఏండ్లుగా ఆ పార్టీ లో ఉండి, సీడబ్ల్యూసీ సభ్యుడిగా పనిచేసి, ఉమ్మడి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన దామోదరకు తెలియదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తనను తిడుతున్న సందర్భంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, నల్లగొండ కాంగ్రెస్ నేత మల్లన్నతోపాటు పలువురు ఉన్నారని చెప్పారు.
వదిలిపెట్టను
ఈ విషయాన్ని తాను వదిలేది లేదని, పార్టీ క్రమ శిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశానని, మల్లు రవికి చెప్పానని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి కూడా వివరిస్తానని చెప్పారు. ఇది తన ఆత్మగౌరవ సమస్య అని, మంత్రితో అమీతుమీ తేల్చుకుంటానని చెప్పారు. దామోదర గతంలోనూ తనతో ఒకట్రెండుసార్లు ఇలాగే మాట్లాడారని, అప్పుడు పట్టించుకోలేదని, కానీ, ఇప్పుడు పచ్చిబూతులు తిట్టారని, తన కుటుంబాన్ని కూడా తిట్టారని, అందుకే వదిలిపెట్టబోనని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

