హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఆదివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై సహచర మంత్రులు విస్మయం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రేవంత్‌రెడ్డి తమకు క్యాబినెట్ సమావేశంలో చెప్పింది ఒకటైతే, సభలో చేసిన ప్రకటన మరొకటని సీనియర్ మంత్రులు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్టు సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఏం చేయాలనే అంశంపై క్యాబినెట్ మంత్రుల మధ్య నాలుగైదు రోజులుగా చర్చ జరుగుతున్నదని సమాచారం. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా సన్నిహిత మంత్రులతో అనే దఫాలుగా చర్చించినట్టు తెలిసింది. ఆదివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ ఇదే అంశంపై గంటలపాటు చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. కేవలం కమిషన్ రిపోర్టు మీదనే చర్యలు తీసుకోలేరని, ఒకవేళ తీసుకున్నా కోర్టుల్లో న్యాయ సమీక్షకు నిలబడవని న్యాయ నిపుణులు సూచించినట్టు సమాచారం.
దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిట్ వేయాలని ప్రతిపాదించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే సిట్ వేస్తే ప్రతీకార రాజకీయ చర్యల్లో భాగంగా చూస్తారని మంత్రులు విముఖత చూపినట్టు సమాచారం. సీబీఐ విచారణ కోరే అంశం కూడా చర్చకు వచ్చిందట. అయితే రాష్ట్రంలో సీబీఐ ప్రవేశం మీద నిషేధం ఉన్నదని, మరోవైపు సీబీఐ, ఈడీ వంటివాటిని ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మలుగా కాంగ్రెస్ ఆరోపిస్తున్నదని, ఇలాంటి సమయంలో సీబీఐని ఆహ్వానిస్తే రాహుల్‌గాంధీని అవమానించినట్టేనని మంత్రుల మధ్య చర్చ జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో సీనియర్ మంత్రి ఒకరు కల్పించుకొని కమిషన్ విచారణ రిపోర్టు మీద హౌజ్‌కమిటీ వేయాలని సూచించినట్టు సమాచారం. దీనికి మంత్రివర్గం మొత్తం అంగీకరించినట్టు సమాచారం. తీరా సభ చివరి అంకంలోకి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా తానే నిర్ణయం తీసకుంటానని రేవంత్‌రెడ్డి ప్రకటించటంతో ఏం జరుగుతున్నదో మంత్రులకు కూడా అర్థంకాక ఇబ్బంది పడ్డట్టు తెలిసింది. కేసును సీబీఐకి అప్పగించాలని ముందుగానే రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారని, కానీ క్యాబినెట్ సమావేశంలో తూతూమంత్రపు చర్చలతో కాలంగడిపి, హౌజ్కమిటీకి ఒప్పుకోవడం ద్వారా తమను పక్కదారి పట్టించారని సీనియర్ మంత్రి ఒకరు సహచర మంత్రితో అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.