హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు ఉన్నాయని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటరు స్లిప్పులు ఇచ్చామని తెలిపారు. పోలింగ్ మొత్తం పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల బయట స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలిపారు. మునుగోడులో 3 చోట్ల ఈవీఎంలు, 4 వీవీప్యాట్లు మార్చారు.
ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6,100 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. రూ. 8.27 కోట్ల నగదు, ఇతర వస్తువులను సీజ్ చేశారు. మునుగోడులో 3.29 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మునుగోడులో ఇవాళ ఒక్కరోజే 98 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. స్థానికేతరులను గుర్తించడంలో తాము నియమించిన బృందాలు బాగా పని చేశాయి. ఇవాళ 70 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపామని తెలిపారు. అందరి సహాయ సహకారాలతో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.