హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయంలో కీలక అధికారుల నియామకం తీవ్ర వివాదాస్పదంగా మారింది. కీలక పదవుల భర్తీలో పారదర్శకత లోపించడమే కాకుండా, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నియామకాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా సీఈవో కార్యాలయంలో అడిషనల్ సీఈవో స్థాయి పోస్టులో ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ స్థానంలో ఒక ఐఏఎస్ అధికారి విధులు నిర్వహిస్తున్నారు. అయితే, నిబంధనలను పకనబెట్టి, అడిషనల్ సీఈవో (నాన్-క్యాడర్) అనే నూతన పోస్టును సృష్టించి ఒక అధికారిని నియమిస్తూ సీఈవో సీ సుదర్శన్‌రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నది.
ఇప్పుడు ఎలాంటి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు లేకపోయినా, ‘సర్’ ప్రక్రియ తుదిదశకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఒక ఐఏఎస్ అధికారి బాధ్యతల్లో ఉండగా మరో నాన్-క్యాడర్ అధికారిని అడిషనల్ సీఈవోగా నియమించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేని నాన్ క్యాడర్ పోస్టును సృష్టించడమే కాకుండా రెవెన్యూశాఖకు చెందిన సీనియర్ అధికారికి ఇవ్వాల్సిన పోస్టులో పశుసంవర్థకశాఖకు చెందిన ఉద్యోగిని కూర్చోబెట్టడంపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం చెప్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నియామకం జరిగిందని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సీఈవో కార్యాలయంలో ఇష్టానుసారంగా కీలక పోస్టులు సృష్టించి వాటిని అనర్హులతో నింపడంపై ముఖ్యమంత్రికి, సీఎస్‌కు ఫిర్యాదు చేయడానికి రెవెన్యూశాఖలో సీనియర్ అధికారులు సిద్ధమవుతున్నారు.