హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ):సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు ర్యాంకుల పంట పండించారు. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌కు చెందిన సంజన సింహా టాప్ ర్యాంకు సొంతం చేసుకొన్నారు. ఈమెకు జాతీయస్థాయిలో 37వ ర్యాంకు లభించింది. హైదరాబాద్‌కే చెందిన కొప్పిశెట్టి కిరణ్మయి జాతీయ స్థాయిలో 56వ ర్యాంకుతో రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో నాలుగు, ఐదు ర్యాంకులు కూడా మహిళలే సొంతం చేసుకొన్నారు. నిజామాబాద్‌కు చెందిన అరుగుల స్నేహ 136వ ర్యాంకుతో నాలుగోస్థానం, బొక్క చైతన్యరెడ్డి 161 ర్యాంకుతో ఐదోస్థానంలో నిలిచారు.
తెలంగాణ టాపర్ సంజనా సింహా జాతీయ స్థాయిలో 37వ ర్యాంకు
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన సంజనా సింహా తెలంగాణ టాపర్‌గా నిలిచారు. జాతీయ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించారు. కిందటేడాది 207వ ర్యాంకుతో ఐఆర్ఎస్లో చేరినా.. ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో మళ్లీ పరీక్ష రాసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె ఐఆర్ఎస్ అధికారిగా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగానికి శిక్షణలో ఉన్నారు. సివిల్స్ పరీక్షలకు తన భర్త హర్షనే మార్గదర్శిగా నిలిచాడని సంజనా సింహా చెప్పారు. సివిల్స్‌లో విజయం సాధించాలంటే దీర్ఘకాల వ్యూహం ఉండాలని ఆమె అన్నారు. నోట్స్ రాసుకోవాలని, రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకోవాలని సూచించారు.
వైకల్యాన్ని జయించి సివిల్స్‌లో విజయం
ఏదైనా చిన్నపాటి వైకల్యం ఉంటేనే కుంగిపోతాం. ఇక జీవితం ముగిసినట్లేననుకుంటాం. కానీ ఒక కన్ను.. ఒక కాలు.. ఒక చేయి పనిచేయకపోయినా పట్టుదలతో చదివి సివిల్స్ సాధించాడు హైదరాబాద్‌కు చెందిన బచ్చుల స్మరణ్‌రాజ్. సోమవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఆయనకు 676 ర్యాంకు వచ్చింది. మల్టీపుల్ డిజేబిలిటీ క్యాటగిరీలో స్మరణ్‌రాజ్ ఐఏఎస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఐఐటీ మద్రాస్‌లో కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆ సమయంలోనే 2017లో సెరిబ్రల్ హెమరేజీ స్ట్రోక్ కారణంగా శరీరంలో ఒక భాగం దెబ్బతిన్నా రెండేండ్లపాటు కఠోర శ్రమతో సివిల్స్ సాధించారు.
సమాజం పట్ల బాధ్యతతోనే
సమాజ నిర్మాణంలో తన వంతు బాధ్యతను నెరవేర్చాలనే సంకల్పంతోనే సివిల్ సర్వీస్ పరీక్షలు రాశాను. నా తల్లిదండ్రుల కష్టానికి 56వ ర్యాంకును బహుమతిగా ఇచ్చాను. సాధించాలన్న కసితో ప్రయత్నిస్తే తప్పక విజయం లభిస్తుంది. మొత్తం నాలుగుసార్లు సివిల్స్ రాశాను. మొదటిసారి 573, రెండవసారి 633 ర్యాంకులు వచ్చాయి. నాలుగో ప్రయత్నంలో 56వ ర్యాంకు సాధించాను. ఎంతో సంతోషంగా ఉన్నది. మాది హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్. 7వ తరగతి వరకు కంచన్‌బాగ్ డిఫెన్స్ స్కూల్లో చదివాను. 8వ తరగతి నుంచి 10 వరకు తార్నాకలోని సందీపమ్ స్కూల్లో, ఇంటర్మీడియట్ ఐఎస్వో జూనియర్ కాలేజీలో చదివాను. ఉస్మానియాలో ఎమ్‌బీబీఎస్, ఎమ్ఎస్ సర్జన్ పూర్తి చేశాను. ఐఏఎస్ సాధించాలనే కోరికతో మూడుసార్లు ప్రయత్నించి నాలుగో ప్రయత్నంలో 56వ ర్యాంకును సాధించాను. ప్రతి రోజు 9 గంటల పాటు చదివేదాన్ని.
– కొప్పిశెట్టి కిరణ్మయి
మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన గుగులవత్ శరత్ నాయక్ మొదటి ప్రయత్నంలోనే 374వ ర్యాంకు సాధించాడు. ఆయన తల్లి యమున గ్రామంలోని మినీ అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నది. శరత్‌నాయక్ చిన్నప్పటి నుంచి చర్లపల్లి, జగిత్యాలలో ఇంటర్ వరకు చదివాడు. వెటర్నరీలో పీడీఎస్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నాడు.
సత్తాచాటిన రైతు కూలీ బిడ్డ
పేదింటి బిడ్డ సివిల్స్‌లో సత్తాచాటాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి చెందిన ఆకునూరి నరేశ్ 117వ ర్యాంకు సాధించాడు. జిల్లాకేంద్రంలోని కాశీంపల్లికి చెందిన ఆకునూరి ఐలయ్య, సులోచన దంపతుల చిన్న కుమారుడు నరేశ్. ఐలయ్య వ్యవసాయ కూలీ, తల్లి సులోచన సింగరేణి సంస్థలో ఔట్‌సోర్సింగ్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివి 6 నుంచి 10 వరకు నర్సంపేటలో విద్యనభ్యసించాడు. చెన్నైలో సిటీ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే శంకర్ ఐఏఎస్ ఆకాడమీలో ఏడాది పాటు కోచింగ్ తీసుకున్నాడు. 5వ అటెంప్ట్‌లో 117వ ర్యాంకు సాధించాడు.
చైతన్యరెడ్డికి 161వ ర్యాంక్
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బొక్క చైతన్యరెడ్డి సివిల్స్‌లో 161వ ర్యాంకు సాధించారు. 2016లో మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీటి పారుదల శాఖ ఏఈగా జాబ్ సాధించారు. అక్కడ పనిచేస్తూనే సివిల్స్‌కి ప్రిపేరయ్యింది. ‘మా అన్న రవికిరణ్‌రెడ్డి ప్రోత్సాహం వల్లే నేనే సివిల్స్ సాధించాను. జాబ్ చేసి ఎంత అలిసిపోయి వచ్చినా కూడా తను చదువుతూ నాకు వినిపించి వివరించేవాడు. అన్నతో పాటు నాన్న సంజీవరెడ్డి, అమ్మ వినోద సహకరించారు. సివిల్స్‌లో ర్యాంకు సాధించాలన్న నా కల నిజం అయ్యింది. ఒకపక్క జాబ్ చేసుకొంటూనే మరోపక్క ఎంతో కష్టపడి చదివాను’ అని చైతన్య అన్నారు.
అఖిల్ యాదవ్‌కు 566వ ర్యాంకు
సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన బుద్ధి అఖిల్ యాదవ్ 566 ర్యాంకు సాధించారు. అఖిల్‌కు ర్యాంకు రావడం పట్ల తల్లి లలిత, తండ్రి నరేశ్‌తో పాటు కొండపాక మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అభినందించారు. తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ శాలువాతో ఘనంగా సన్మానించారు. తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే సివిల్స్ పరీక్షల్లో విజేతగా నిలిచానని అఖిల్ అన్నారు.
చిరుద్యోగి కుమారుడికి సివిల్స్
కాకతీయ విశ్వవిద్యాలయ బిల్డింగ్ డివిజన్ ఉద్యోగిగా పని చేస్తున్న బైరి శివశంకర్ కుమారుడు రుత్విక్ 461 ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
శ్రవణ్ కుమార్ 521వ ర్యాంకు
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీకి చెందిన పూజారి శ్రవణ్‌కుమార్ 521వ ర్యాంకు సాధించాడు. తండ్రి రాఘవేంద్రరావు రామగుండం ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగం ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. తల్లి లలిత రావు గృహిణి. 2017లో ఇంజినీరింగ్ (ఈఈఈ) పూర్తి చేసిన శ్రావణ్‌కుమార్, మూడోసారి ప్రయత్నంలో ర్యాంకు సాధించాడు.
అమ్మ ప్రోత్సాహంతోనే విజయం సాధించా
‘మా అమ్మ ప్రోత్సాహం వల్లే సివిల్స్‌లో ర్యాంకు సాధించగలిగాను’ అని మాడిశెట్టి అనన్యప్రియ తెలిపారు. ఆమె స్వస్థలం హుజూరాబాద్. తల్లిదండ్రులు అజయ్ కుమార్, రేవతి న్యాయవాదులు. అనన్య ఆరేండ్లుగా సివిల్స్ రాస్తున్నారు. నాలుగు సార్లు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. తల్లి రేవతి ప్రోత్సాహంతో అనన్య వెనుకడుగు వేయకుండా ప్రయత్నించారు. ఈసారి 544వ ర్యాంకు సాధించారు. అనన్య ఎలాంటి కోచింగ్ తీసుకోకపోవడం గమనార్హం.
పట్టువదలని రంజిత్‌కుమార్
వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతం కరీమాబాద్ తోట్లవాడకు చెందిన పార్వతి రంజిత్‌కుమార్ సివిల్స్ 574వ ర్యాంకు సాధించాడు. 2020లో విఫలమైనా పట్టు వదలకుండా ప్రయత్నించి మంచి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా పలువురు రంజిత్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తమ కుమారుడు ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. రంజిత్‌కుమార్ తండ్రి పార్వతి కృష్ణంరాజు టీఆర్ఎస్ నేతగా, కాపు సంఘం నాయకుడిగా అందరికీ సుపరిచితుడు. కాగా తల్లి మాధవి గృహిణి. ఐఏఎస్ కావడమే తన కుమారుడి లక్ష్యమని కృష్ణంరాజు తెలిపారు.
జాబ్ చేస్తూ ర్యాంక్ కొట్టిన పవిత్ర
ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసూ ప్రిపేర్ అయిన జూబ్లీహిల్స్‌కు చెందిన పవిత్ర సివిల్స్‌లో 608 ర్యాంకు సాధించింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేసిన పవిత్ర, హైదరాబాద్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, బెంగళూరులోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత సివిల్స్‌పై దృష్టి పెట్టారు. ‘ఒక సంవత్సరం కోచింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత వర్క్ చేసుకుంటూ చదివాను. ఉదయం రెండు గంటలు, తర్వాత సాయంత్రం 8 గంటల నుంచి రాత్రి 12గంటల వరకు చదివేదాన్ని. గతంలో 6 మార్కులతో ఇంటర్వ్యూ మిస్ అయ్యింది. ఈ సారి ర్యాంకు సాధించాను’ అని పవిత్ర చెప్పుకొచ్చారు.
మౌనికకు 637వ ర్యాంకు
భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం పట్టణానికి చెందిన పోరిక మౌనిక సివిల్స్‌లో 637 ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఆమె తండ్రి రాంకుమార్ బీడీసీ కంపెనీ హైదరాబాద్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి వాణి భద్రాచలంలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. మౌనిక విద్య ప్రాథమిక స్థాయి నుంచి బీఫార్మసీ వరకు ఆమె హైదరాబాద్‌లోనే సాగింది. ఐఏఎస్ కావడం ఆమె చిన్నప్పటి కల. తల్లిదండ్రులు ఆమె ఆసక్తిని గమనించి చదివించారు. మౌనిక అనుకొన్నది సాధించింది.
ధరావత్ సాయికి 650 ర్యాంకు
తిరుమలగిరి మండలం సిద్దిసముద్రం తండాకు చెందిన ధరావత్ సాయి ప్రకాశ్ సివిల్స్‌లో 650 ర్యాంకు సాధించారు. తండ్రి ధరావత్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ప్రకాశ్ పదో తరగతి వరకు జగదేవ్‌పూర్‌లో చదువుకొన్నాడు. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించాడు. దీంతోప్రకాశ్ బంధువులు, తండా వాసులు సంతోషం వ్యక్తంచేశారు.
సీఎస్బీ అకాడమీ ప్రభంజనం
2021 సివిల్స్ ఫలితాల్లో సీఎస్బీ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తమ అకాడమీలో శిక్షణ పొందిన 14 మంది సివిల్స్‌లో ర్యాంకులు సాధించారని అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.
ఏకేఎస్ అకాడమీ నుంచి 14 మంది
సివిల్స్ ఫలితాల్లో ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ నుంచి 14 మంది విద్యార్థులు ఎంపికయ్యినట్టు అకాడమీ సీఈవో ఎంఎస్ శశాంక్ తెలిపారు. తమ విద్యార్థులు యశ్వంత్‌కుమార్‌రెడ్డి 15, తిరుమణి శ్రీపూజ 62, ముస్తఫా హష్మి 162, అమిత్ రంజన్ 175, గరీమా 220, అశ్విన్ మణిదీప్ 235 ర్యాంకు సాధించినట్టు శశాంక్ వెల్లడించారు.
ట్వంటీఫస్ట్ సెంచరీ అకాడమీకి ర్యాంకులు
సివిల్స్ ఫలితాల్లో ట్వంటీఫస్ట్ సెంచరీ అకాడమీకి చెందిన మౌర్య భరద్వాజ్ 28, కిరణ్మయి 56, మనీషాకు 154వ ర్యాంకు సాధించినట్టు అకాడమీ చైర్మన్ క్రిష్ణప్రదీప్ వెల్లడించారు.
అనలాగ్ విద్యార్థికి 8వ ర్యాంకు
సివిల్స్ -2021 ఫలితాల్లో అనలాగ్ ఐఏఎస్ అకాడమీకి చెందిన పలువురు విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సొంతం చేసకున్నట్టు సంస్థ డైరెక్టర్ విన్నకోట శ్రీకాంత్ తెలిపారు. తమ విద్యార్థులు ఇషితా రాథి 8, యశ్త్ శేఖర్ 12, యశ్వంత్‌కుమార్‌రెడ్డి 15, సాహిత్య 24, భరద్వాజ్ 28, అక్షయ్ పిైళ్లె 51, శ్రీపూజ 62 ర్యాంకులు సాధించారని చెప్పారు. మొత్తంగా 49 మందికి ర్యాంకులు వచ్చినట్టు వెల్లడించారు.
కానిస్టేబుల్ కొడుకుకు 336వ ర్యాంక్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో ఉంటున్న కానిస్టేబుల్ రాంగోపాల్, మల్లేశ్వరి దంపతుల చిన్న కుమారుడు శ్రీధర్ సివిల్స్‌లో 336వ ర్యాంకు సాధించాడు. రాంగోపాల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆరో ప్రయత్నంలో శ్రీధర్ 336వ ర్యాంకు సాధించాడు.
ఐఏఎస్ నా లక్ష్యం: సంతోష్‌కుమార్‌రెడ్డి
మాది నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి గ్రామం. ఐఏఎస్ కావాలన్నది నా చిన్ననాటి కల. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. ఐదో ప్రయత్నంలో ప్రస్తుతం 448వ ర్యాంకు వచ్చింది. ఐఎఎస్ నా లక్ష్యం. మళ్లీ సివిల్స్ రాస్తా.
అమ్మ కష్టానికి ప్రతిఫలం
మాది నిజామాబాద్. మా ఇంటికి అమ్మ పద్మ ఒక్కరే ఆధారం. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డాం. స్కిలింగ్ ప్రోగాం ద్వారా అమ్మ కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకొని కాంట్రాక్టు ఉద్యోగం సాధించింది. కంప్యూటర్ బేసిక్స్ సర్టిఫికెట్‌పై ఐఏఎస్ సంతకం చూసి నేను కూడా ఐఏఎస్ కావాలని నిర్ణయించుకొన్నాను. అమ్మ ఎంతో ప్రోత్సహించింది. రోజుకు 13-14 గంటలు చదివాను. నాలుగో ప్రయత్నంలో 136వ ర్యాంకు సాధించాను.
–అరుగుల స్నేహ
తెలంగాణకు చెందిన సివిల్స్ ర్యాంకర్లు