హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 ( నమస్తే తెలంగాణ ): ఇకపై అన్ని ఎల్లో ప్లేట్ వాహనాలను వైట్ నంబర్ ప్లేట్ వాహనాలుగా మార్చాలని తెలంగాణ వాహన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ద్విచక్ర వాహనాలను బైక్ ట్యాక్సీలుగా వినియోగించుకోవచ్చనే కేంద్రం ప్రతిపాదనలపై తెలంగాణ క్యాబ్ అసోసియేషన్, గిగ్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదనను అమలు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా బీఆర్టీయూ క్యాబ్ యూనియన్ అధ్యక్షుడు నగేష్, తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ శుక్రవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వాణిజ్య వాహనాల డ్రైవర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. వేలాది రూపాయల పన్ను చెల్లించి వాణిజ్య వాహనాలను కొనుగోలు చేయడం ఎందుకో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.