హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 ( నమస్తే తెలంగాణ ) : ‘ఉచిత బస్సు స్కీంతో గిరాకీ తగ్గి తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల జీవితాలు అతలాకుతలమవుతుం టే ఇతర రాష్ర్టాల క్యాబ్‌లు ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ ఇక్కడివారి ఉపాధిని దెబ్బకొట్టడం ఎంతవరకు సమంజసం?’ అంటూ తెలంగాణ క్యాబ్ అసోసియేషన్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్, టీఏటీయూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను మాత్రమే తాము అడ్డుకున్నామని చెప్పారు. ‘తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు ఏపీ డ్రైవర్ల వాహనాలను హైదరాబాద్‌లో తిరగనివ్వాలి’ అని చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవణ్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ క్యాబ్ అసోసియేషన్స్ నాయకులు మండిపడ్డారు.
మోటర్ వాహన చట్టం ప్రకారం ఇతర రాష్ర్టాల వాహనాలు అనుమతి లేకుండా ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించరాదని క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్‌కుమార్ తెలిపారు. వాహన పన్ను చెల్లిస్తూ గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నామని, ఎలాంటి పన్ను చెల్లించకుండా ఇతర రాష్ర్టాల వాహనాలు ఇక్కడ యాప్ ల సహకారంతో రాకపోకలు సాగించడం నేరమని పేర్కొన్నారు. తెలంగాణ డ్రైవర్ల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నెల 15న క్యాబ్‌ల బంద్‌కు వాళ్ల పార్టీకి చెంది న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు పలకడం కుట్రగానే భావిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని డిమాండ్ చేశారు.
ఓలా, ఊబర్, ర్యాపిడో తదితర యాప్‌ల్లో ఇతర రాష్ర్టాల వాహనాలు ఇక్కడ వ్యాపా రం సాగిస్తున్నాయని, దీంతో ఇక్కడి డ్రైవ ర్లు ఉపాధి కోల్పోతున్నారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో యాప్ అగ్రిగేటర్స్‌కు ప్రభుత్వం అనుమతే ఇవ్వలేదని, వైట్ నంబర్ ప్లేట్ స్థానంలో ఎల్లో నంబర్ ప్లేట్ పెట్టుకొని వాహనాలను అక్రమంగా తిప్పుతున్నారని చెప్పారు. అక్రమంగా తిరుగుతున్న వాహనాలపై రవా ణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ డ్రైవర్లంతా కలిసి నిరసనకు దిగినట్టు చెప్పారు. తమ పొట్ట కొడుతామంటే కచ్చితంగా వాహనాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.