చండూరు/నీలగిరి, ఫిబ్రవరి 14 : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్‌ను పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేయడం నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో కలకలం రేపింది. మఫ్టీలో వచ్చిన వాళ్లు వివరాలు చెప్పకుండా శేఖర్‌ను బలవంతంగా కారులో ఎక్కించడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి తలుపులు తోసుకుంటూ ఇంట్లోకి వచ్చి తన భర్తను వాహనంలో ఎక్కించారని శేఖర్భార్య సంతోష వాపోయింది. ఎన్నిసార్లు అడిగినా ఎవరనేది చెప్పకుండా భయబ్రాంతులకు గురిచేసినట్టు తెలిపింది.
తన భర్తను వెంటనే విడుదల చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేసింది. రాష్ట్రంలో ప్రజాపాలన ముసుగులో రాక్షస పాలన చేస్తున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. శేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ శుక్రవారం ఎస్పీ శరత్చంద్ర పవార్‌ను కలిశారు. అనంతరం నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో శేఖర్‌ను పరామర్శించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో అన్నెపర్తి శేఖర్ కొట్టాడని చండూరుకు చెందిన చిట్టిపోలు మహేశ్ ఫిర్యాదు చేయడంతోనే శేఖర్‌ను అరెస్టు చేసినట్టు ఎస్ఐ వెంకన్న తెలిపారు.