Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కుటుంబం వెనుదిరిగింది. అమర్నాథ్లో మంచు శివ లింగాన్ని దర్శించుకున్నట్లు రాజా సింగ్ చెప్పారు. మూడు రోజులుగా అమర్నాథ్ యాత్ర మార్గంలో వర్షాలు కురుస్తున్నాయని రాజా సింగ్ మీడియాకు చెప్పారు. తాము హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం కావాలని భావించామని చెప్పారు. కానీ, అననుకూల వాతావరణం నేపథ్యంలో గుర్రాలపై తిరుగు ప్రయాణమైనట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే జమ్ముకశ్మీర్‌లోని అమర్నాథ్లో కుంభ వృష్టి కురుస్తున్నది. ఒక్కసారిగా గుహ పరిసరాల్లోకి వరద వచ్చి పడటంతో అందులో చిక్కుకున్న 16 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 40 మందికి పైగా గల్లంతై ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రులను దవాఖానలకు తరలించామని జమ్ముకశ్మీర్ ఐజీపీ చెప్పారు. బురదలో చిక్కుకుని కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ముగ్గురు యాత్రికులను సహాయ సిబ్బంది వెలికి తీసి, హెలికాప్టర్లో దవాఖానకు తరలించారు.
కుంభవృష్టి వర్షం దాటికి 25 టెంట్లు కొట్టుకుపోయాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆరు ఆర్మీ హెలికాప్టర్లలో సహాయ చర్యలు చేపట్టారు. పది ఆర్మీ టీమ్‌లు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ జవాన్లు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు అమర్ నాథ్ యాత్ర నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు.