హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబును రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతిలో మాజీ దేశ ప్రధాని, ప్రఖ్యాత సాహితీవేత్త, భారత రత్న పీవీ నర్సింహారావు, సినీగేయ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సీ నారాయణరెడ్డి, ప్రముఖ సాహితీవేత్త దాశరథి, తెలంగాణ సాహిత్య అస్తిత్తం కాళోజీ, తెలంగాణ నటుడు స్వర్గీయ కాంతారావు, భాగవతాన్ని తెలుగీకరించిన బమ్మెర పోతన విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ నడిఒడ్డున మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం, రవీంద్రభారతిలో బాల సుబ్రమణ్యం విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ అంశంలోనూ రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవచూపాలని ఆమె కోరారు.