హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనీస్పై ప్రభుత్వం నిషేధం విధించింది. బుధవారం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉడకబెట్టని కోడిగుడ్లతో మయోనీస్ తయారీ, నిల్వ, అమ్మకాన్ని ఏడాది పాటు నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేరొన్నారు. గుడ్ల పచ్చి సొన, నూనె, వెనిగర్, నిమ్మరసం వంటివి కలిపి మయోనీస్ తయారు చేస్తున్నారని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో గుర్తించిన అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
స్ట్రీట్ ఫుడ్‌లో మయోనీస్ వినియోగం విపరీతంగా పెరిగింది. సాండ్విచ్, సలాడ్, షవర్మా, గ్రిల్డ్ మీట్, మోమోస్ వంటి ఆహార పదార్థాలను మయోనీస్తో కలిపి తింటుంటారు. మయోనీస్ను హోటళ్లు, ఫుడ్ కోర్ట్ నిర్వాహకులే తయారు చేసి ఫ్రిజ్‌లలో వారాల తరబడి నిల్వ చేస్తుండటం తో కలుషితం అవుతున్నది. దీంతో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నా యి. హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలో ఓ మహిళ మరణించింది.