హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆటోల బంద్‌ను విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జూపార్క్ వద్ద ఏర్పాటుచేసిన బీఆర్టీయూ ఆటో యూనియన్ స్టాండ్‌ను మంగళవారం మారయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని చేపట్టే ఆటోల బంద్‌ను ప్రతి ఒక్క డ్రైవర్ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ దయ్యాల దాసు, భవన నిర్మాణ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చెన్నయ్య, నరసింహ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నీరజంన్, పాషా, ఉపేందర్, మక్బూల్, ముజాత్ తదితరులు పాల్గొన్నారు.