హిమాయత్‌నగర్, నవంబర్16: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం విశేషంగా పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటోలపై ఉన్న ఎంవీ ట్యాక్స్, ఆటో ఫిట్నెస్ పెనాల్టీ మినహాయింపు, లైసెన్స్‌కు 8వ తరగతి నిబంధనను ఎత్తివేయడం, ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా తదితర సౌకర్యాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.
1783 మంది మైనార్టీ ఆటో డ్రైవర్లకు 50 శా తం సబ్సిడీతో ప్రభుత్వం బ్యాంకు రుణాలను మం జూరు చేసి ఆటోలను ఇప్పించిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆటో డ్రైవర్ల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చేప్పే మోసపూరిత మాటలను నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో అశాంతి నెలకొంటుందని, కాంగ్రెస్ వైఖరి వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మరింత మేలు జరగాలంటే ఈ నెల 30న ఆటో డ్రైవర్లందరూ కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జహీరుద్దీన్, జేఏసీ నాయకులు మహ్మద్ అజీమొద్దీన్, ఇలియాస్ ఖురేషి పాల్గొన్నారు.