హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ఉదయం 11 గంటలకు వేర్వేరుగా కొలువుదీరాయి. దివంగత సభ్యులకు సంతాపం తెలిపిన తర్వాత రెండు సభలు ఈ నెల 27కు వాయిదాపడ్డాయి. జాతీయగీతాలాపన అనంతరం శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభా కార్యక్రమాలను ప్రారంభిస్తూ.. సభ్యులంతా కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని విజ్ఞప్తిచేశారు. ప్యానల్ చైర్మన్లుగా రెడ్యానాయక్, మోజంఖాన్, హన్మంత్ షిండే, మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన సభ్యుల సంతాప సందేశాలను ప్రారంభిం చారు. మాజీసభ్యులు కుంజా బొజ్జి, అజ్మీరా చందూలాల్, కేతిరి సాయిరెడ్డి, కుంజా భిక్షం, ఎం సత్యనారాయణరావు, మాచర్ల జగన్నా థం, రాజయ్యగారి ముత్యంరెడ్డి, బొగ్గారపు సీతారామయ్య, చేకూరి కాశయ్యకు శాసనసభ తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నదని స్పీకర్ తెలిపారు. వారి కుటుంబసభ్యులకు సభ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నదని పేర్కొన్నారు. మాజీ సభ్యులందరూ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం, మంత్రులు, సభ్యులు వారివారి స్థానాల్లో నిల్చొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
మండలిలో నూతన సభ్యుల పరిచయం
శాసనమండలి ప్రారంభం కాగానే ప్రొటెం చైర్మన్ వీ భూపాల్‌రెడ్డి ఇటీవల పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి గెలుపొందిన సభ్యులు సురభివాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సభకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన పీ లింబారెడ్డి, టీ లక్ష్మారెడ్డి, రెహ్మాన్, రాజయ్యగారి ముత్యంరెడ్డిలకు కౌన్సిల్ సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించింది. మండలి ప్యానల్ వైస్చైర్మన్లుగా జాఫ్రీ, నారదాసు లక్ష్మణ్‌రావును ప్రొటెం చైర్మన్ ప్రకటించారు. అనంతరం గృహనిర్మాణ సంస్థ సవరణ ఆర్డినెన్స్, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ ఆర్డినెన్స్‌తోపాటు చలన చిత్రఅభివృద్ధి సంస్థ, ట్రాన్స్‌కో,టీఎస్ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, తెలంగాణ విద్యుత్తు ఆర్థిక సంస్థ, టీఎస్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్, తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ నివేదికలను సభకు సమర్పించారు.