KTR | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయసంహిత తదితర నూతన చట్టాలతో పోలీసు రాజ్యం నడుస్తుందంటూ ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయని, నిరసన దీక్ష చేపట్టినా నేరమయ్యే పరిస్థితి ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తంచేశారు. ఆ చట్టాలపై ప్రభుత్వం ఆలోచించి విధాన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన ‘తెలంగాణ సివిల్ న్యాయస్థానాల సవరణ బిలు’్లపై మాట్లాడారు. ప్రభు త్వం తెచ్చిన ‘తెలంగాణ సివిల్ కోర్ట్స్ అమెండ్మెంట్ బిల్లు’కు బీఆర్ఎస్ తరపున మద్దతు ప్రకటించారు. శాంతిభద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. లైంగికదాడులు, సైబర్‌క్రైమ్ నేరాలను విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని, బాధితులకు న్యాయం చేయడంతోపాటు నిందితులకు శిక్ష పడుతుందన్న నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. మరీ ముఖ్యంగా లైంగిక వేధింపులు, లైంగికదాడుల కేసుల్లో శిక్షలు వేగంగా పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నేరాల ప్రవృత్తి మారుతున్నదని, అందుకు అనుగుణంగా చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. సైబర్ నేరాల ద్వారా రూ.లక్షలు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉండాలని, జస్టిస్ డిలేడ్.. జస్టిస్ డినైడ్ అంటారని, అందుకే వీలైనంత వేగంగా న్యాయం చేసేలా చట్టాలు ఉండాలని కోరారు.
ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన న్యాయ చట్టా లు తెలంగాణ రాష్ర్టానికి ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తున్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం వామపక్ష, ప్ర జాఉద్యమాలకు అడ్డా అని, కేంద్ర చట్టాలతో పోలీసు రాజ్యమవుతుందని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా చట్టం ఉన్నదని, ఆ చట్టం వస్తే పౌరులు తమ భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. కర్ణాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ర్టాలు ఈ చట్టంలో మార్పులు చేయాలంటున్నాయని గుర్తుచేశారు. డైరెక్ట్‌గా ఆ బిల్లుతో సంబంధం లేకున్నా తెలంగాణ ప్రభుత్వం కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని సూచించారు. అలాం టి బిల్లు ఏదైనా వస్తే మాత్రం మనమందరం కలిపి దానిని అడ్డుకోవాల్సి ఉన్నదని చెప్పారు.
సోషల్‌మీడియాలో వ్యక్తిత్వ హననం అందరి మీదా జరుగుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. దానికి ఒక పార్టీ మాత్రమే తప్పు చేస్తున్నదని, మిగతా పార్టీలు పునీతులు అన్నట్టు ఏమీ లేదని పేర్కొన్నారు. కాబట్టి ఆ అంశంపై కూడా అవసరమైతే చర్చ పెట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా రాష్ట్రంలో కేసులు పెడుతున్నారని, పోస్టులు డిలీట్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు సభలో మాట్లాడుతున్నప్పుడు లోపల విజువల్స్ చూ పించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బిల్లుపై ప్రసంగిస్తున్న సమయంలో కొండా సురేఖ తదితర మంత్రులు అడ్డుతగలగా ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే, మంత్రులు రన్నింగ్ కామెం ట్రీ చేస్తే ఎలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్లో జరిగే నిరసనలన్నీ వీడియోలు, ఫొటోలు తీస్తున్నారని గుర్తుచేశారు. ఇటీవల అసెంబ్లీకి సంబంధించిన వీడియోలను కొం దరు వ్యక్తులు చిత్రీకరించిన తీరు సభ్య సమా జం తలదించుకునేలా ఉన్నదని, అది దుర్మార్గపు చర్య అని, అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. దానిపైనా, సభలో భాషపై కూడా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సభలో మైక్‌ను అందరికీ ఇవ్వాలని, ముఖ్యమంత్రి నుంచి సభ్యుల వరకు మాట్లాడేప్పుడు ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకుని భాషని ఉపయోగించాలని కేటీఆర్ సూచించా రు. ఇటీవల సభలో జరిగిన సంఘటనలు పు నరావృతం కాకుండా చూసుకోవాలని కోరా రు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాల భూమి ని హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించడంపై ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలను సభకు వివరించారు. వ్యవసాయ వర్సిటీలో పరిశోధనల కోసం భూమి కావాల్సి ఉం టుందని తెలిపారు. హైకోర్టు భవనాన్ని మరోచోట నిర్మించాలని సూచించారు.
సోషల్‌మీడియాలో వస్తున్న ఫేక్ వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని రోడ్డు రవాణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయంపై కొందరు కావాలనే వీడియోలు క్రియేట్ చేసి మహిళలను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సభలో తాను, మంత్రి సీతక్క మాట్లాడుతున్న వీడియోలను కూడా ఎడిట్ చేసి వైరల్ చేశారని, అలాంటి వారిపై పోలీసు లు చర్యలు తీసుకోవాలని కోరారు. ‘తెలంగాణ సివిల్ న్యాయస్థానాల సవరణ బిలు’్లపై చర్చ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని, కానీ అది ఎదుటి వ్యక్తిని అవమానించే విధంగా ఉంటే ఎట్లా? అని ప్రశ్నించారు. సభలో జరిగిన అంశాలను కించపరిచి, అవమానపరిచేలా వీడియోలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.
గత ప్రభుత్వ హయాంలో లేని నిర్బంధాన్ని ప్రజలు ప్రస్తుతం చవిచూడాల్సి వస్తున్నదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తంచేశారు. కోర్టుల వ్యవస్థను పటిష్టపరచాలని, ఎక్కువ మంది జడ్జీలను నియమించాలని, అప్పుడే అపరిష్కృత కేసుల సంఖ్య తగ్గిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అనధికారికంగా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్నాచౌక్ ఉద్యమాలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. ఆఖరికి పుస్తకావిష్కరణ సభల నిర్వహణకు సైతం అనుమతి తీసుకోవాలని హుకూం జారీ చేశారని, గత ప్రభుత్వంలోనూ ఇలాంటి ని ర్బంధం చూడలేదని స్పష్టంచేశారు. ప్రభు త్వం వెంటనే స్పందించి వీటిపై దృష్టి సారించాలని, భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు.
శాంతిభద్రతలపై పరిధి దాటితే కఠిన చర్యలు తీసుకోకతప్పదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హెచ్చరించారు. ‘తెలంగాణ సివిల్ న్యాయస్థానాల సవరణ బిల్లు’పై సభ్యులు లేవనెత్తిన అంశాలపై శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకే కోర్టులు, జడ్జిల ద్రవ్య అధికార పరిధిని విస్తరిస్తూ బిల్లుకు సవరణలు చేశామని వివరించారు. కేంద్ర చట్టాలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. సైబర్ క్రైమ్స్‌ను ఏవిధంగా అదుపు చేయాలనే అంశంపై దృష్టి సారించామని తెలిపారు. బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అసెంబ్లీలో సభ్యులు, మంత్రులు మాట్లాడిన వీడియోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర సభ్యులు విజ్ఞప్తి చేయగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వెంటనే స్పందించారు. వీడియోలను మార్ఫింగ్చేసి వైరల్ చేసిన ఘటనపై విచారణ జరపాలని, బాధ్యులను గుర్తించాలని నిర్ణయించారు. ఆపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు.