GRMB | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు డీపీఆర్‌ను సత్వరం అందించాలని, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని రాష్ట్ర అధికారులు డిమాండ్ చేశారు. అవార్డుకు విరుద్ధంగా చేపడుతున్న ఆ పనులను ఏపీ వెంటనే నిలిపేయాలని, అనుమతులు వచ్చాక ముందుకు వెళ్లాలని తేల్చిచెప్పారు. జీబీ లింక్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకుండా ఎందుకు దాస్తున్నారని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ను నిలదీశారు. జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ అజగేషన్ నేతృత్వంలో సోమవారం జలసౌధలో బోర్డు సమావేశం జరిగింది. చైర్మన్ ఏకే ప్రధాన్, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్‌కుమార్, గోదావరి డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బోర్డు నిర్వహణ తీరుపై తెలంగాణ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ తేదీలపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇప్పటికే రూ.1,000 కోట్ల పనులు
ఏపీ చేపట్టిన జీబీ లింక్ ప్రాజెక్టుపనులను వెంటనే నిలిపేయాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖకు, సీడబ్యూసీకి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. జీబీ లింక్ ప్రాజెక్టు సమాచారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే బో ర్డును ఆదేశించిందని, ఆ విషయం దాచిపెట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఇకపై ఎలాంటి సమాచారాన్నైనా బోర్డులోని సభ్యులందరి దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా జీబీ లింక్ ప్రాజెక్టును చేపడుతున్నదని, పోలవరం విస్తరణకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యం 10 వేల క్యూసెక్కులేనని, కానీ ఇప్పటికే 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిందని, ప్రస్తుతం జీబీలింక్లో భాగంగా కుడికాలువను ఏకంగా 40 వేల క్యూసెక్కులను విస్తరించే పనులను చేపట్టిందని ఆక్షేపించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేవరకే తాడిపూడి లిఫ్ట్‌ను కొనసాగిస్తామని, ఆ తర్వాత దానిని తొలగిస్తామని చెప్పి షరతులతో సీడబ్ల్యూసీ నుంచి ఏపీ అనుమతులను పొందిందని తీసుకున్నదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం తాడిపూడి లిఫ్ట్‌ను తొలగించకపోగా ఆ కాలువను ఏకంగా 1,400 క్యూసెక్కుల నుంచి 20 వేల క్యూసెక్కులకు విస్తరించేందుకు ఏపీ ప్రణాళికలను రూపొందించిందని మండిపడ్డారు. దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు ప్రస్తుతం జీబీ లింక్ ప్రాజెక్టు ప్రణాళికల దశలోనే ఉన్నదని, ఇంకా డీపీఆర్ సిద్ధం కాలేదని బుకాయించే ప్రయత్నం చేసింది. దీంతో ఏపీ కుట్రలను తెలంగాణ అధికారులు ఆధారాలతో బట్టబయలు చేశారు.జీబీ లింక్ పనుల కోసం అమరావతి జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఇటీవల ఏపీ క్యాబినెట్ తీర్మానించిందని, 2018లో పల్నాడు డ్రాట్ మిటిగేషన్ సీమ్ కింద 2 ప్యాకేజీలకు సంబంధించిన పనులను రూ.5 వేల కోట్లతో ఏపీ చేపట్టిందని, ఇప్పటికే దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చు చేసిందని, ఆ పనులన్నీ జీబీ లింక్‌లో భాగమేనని స్పష్టం చేశారు. దీంతో జీబీ లింక్ డీపీఆర్‌ను అందించాలని బోర్డు చైర్మన్ ఏపీని ఆదేశించారు.
వేధింపులపై నిజనిర్ధారణకు కమిటీ
రాష్ర్టాల ఉద్యోగులనుబోర్డు మెంబర్ సెక్రటరీ వేధింపులకు గురిచేస్తున్నారని, ఇష్టారాజ్యంగా మెమోలు జారీ చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై కేంద్ర జల్‌శక్తి శాఖకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టడం లేదని బోర్డు చైర్మన్‌ను నిలదీశారు. దీనిపై ఏపీ కూడా గొంతు కలపడంతో మెంబర్ సెక్రటరీ వేధింపులపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కమిటీ వేయాలని నిర్ణయించారు.
పెద్దవాగు ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు..
గతేడాది భారీ వర్షాల నేపథ్యంలో గండి పడిన పెద్దవాగు ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని బోర్డులో నిర్ణయించారు. ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు, ఆధునికీకరణకు మొత్తంగా రూ.92.5కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అయితే తాత్కాలిక మరమ్మతులకు రూ.15కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.