గురువారం 04 జూన్ 2020
Telangana - May 04, 2020 , 01:04:04

కరోనాపై పోరుకు 3.5 వేల కోట్లు

కరోనాపై పోరుకు 3.5 వేల కోట్లు

  • 30 రోజుల్లో పలు విడుతలుగా విడుదల
  • కొవిడ్‌ అంతానికి రాజీపడని తెలంగాణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత మాత్రం రాజీపడటంలేదు. వైరస్‌ నీడ పడకముందే ప్రత్యేక వ్యూహంతో ముందస్తు చర్యలు చేపట్టింది. మార్చి 2న తొలి పాజిటివ్‌ కేసు నమోదైన క్షణాన్నే రాష్ట్రంలో అప్రమత్త చర్యలు చేపట్టింది. నాటినుంచి కొవిడ్‌ నియంత్రణకు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. మార్చి 16 నుంచి కేవలం 30 రోజుల్లో పలు విడుతల్లో రూ.3,410.09 కోట్లు విడుదల చేసింది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన కుటుంబాలను, వలస కూలీలను ఆదుకొనేందుకు, తమ ప్రాణాలను ఎదురొడ్డి సేవలందిస్తున్న వైద్య, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌, గ్రామపంచాయతీల పరిధిలోని కొవిడ్‌ వర్కర్లకు ఇన్సెంటివ్‌కు ఈ నిధులు విడుదలచేసింది.

శాఖలవారీగా నిధుల ఖర్చు..

కొవిడ్‌ కట్టడికి రాష్ట్ర బడ్జెట్‌ నుంచి వైద్యారోగ్యశాఖకు రూ.56.06 కోట్లు, గచ్చిబౌలి టిమ్స్‌లో వసతుల కల్పనకు రూ.18 కోట్లు ప్రభుత్వం విడుదలచేసింది. రాష్ట్ర విపత్తుల నిధి నుంచి మొదట క్వారంటైన్‌, శాంపిల్‌ కలెక్షన్‌, స్క్రీనింగ్‌, తాత్కాలిక వసతులు, ఆహారానికి రూ.116.25 కోట్లు, మందులకు రూ.350 కోట్లు, వైద్యులు, ఇతర సిబ్బందికి వసతి, భోజనం, అలవెన్స్‌లకు రూ.20.06 కోట్లు మంజూరుచేసింది. గాంధీ వీఆర్డీ ల్యాబ్‌ పరికరాల కొనుగోలు, వికారాబాద్‌ చెస్ట్‌, గాంధీ దవాఖాన, ఆర్మీ క్యాంపస్‌లలో పునరుద్ధరణ పనులు, ఇతర ఏర్పాట్లకు రూ.55.50 కోట్లు విడుదలచేసింది. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ నిధుల నుంచి వైద్య విభాగాల్లో ప్రత్యేక ఏర్పాట్లకు రూ.181.82 కోట్లు ఇచ్చింది. వైద్యులు, ఇతర విభాగాల సిబ్బందికి సీఎం కేసీఆర్‌ స్పెషల్‌ ఇన్సెంటివ్‌ ప్రకటించారు. రెగ్యులర్‌ హెల్త్‌ సిబ్బందికి 10 శాతం చెల్లించేందుకు రూ.18 కోట్లు, హెల్త్‌ వర్కర్లకు రూ.7.17 కోట్లు, జీహెచ్‌ఎంసీ కార్మికులకు  రూ.20.76 కోట్లు,  హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ వర్క్స్‌, శానిటేషన్‌ విభాగంలోని కొవిడ్‌ వర్కర్లకు రూ.4.16 కోట్లు ఇచ్చింది. 

ఎంఏయూడీ పరిధిలోని కొవిడ్‌ వర్కర్లకు రూ.16.14 కోట్లు, గ్రామపంచాయతీల్లో మల్టీ పర్పస్‌ వర్కర్లకు చెల్లించేందుకు రూ.21.84 కోట్లు విడుదలచేసింది. భద్రతా ఏర్పాట్లు, పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఆ శాఖలోని ఇతర సిబ్బందికి ఆహారం, రవాణా, ఇతరాల కోసం రూ.53.53 కోట్లు అందజేసింది. పౌరసరఫరాలశాఖ ద్వారా వలస కూలీలకు ఎస్డీఆర్‌ఎఫ్‌ కింద రూ.500 చొప్పున సాయంగా రూ.16.78 కోట్లు, వారికి 12 కిలోల బియ్యం, గోధుమ పిండి పంపిణీకి రూ.13.18 కోట్లు మంజూరుచేసింది. ఆహారభద్రత కార్డు ఉన్న 87.59 లక్షల కుటుంబాలకు రూ.1,500 జమచేసేందుకు రూ.1,314 కోట్లు, ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యం పంపిణీకి రూ.1,103 కోట్లు మంజూరుచేసింది. అదనంగా గుర్తించిన వలస కార్మికులకు 12 కిలోల బియ్యం పంపిణీకి రూ.8.24 కోట్లు, రూ.500 ఆర్థిక సాయం కలిపి మొత్తం రూ.23.84 కోట్లు విడుదలచేసింది.

విడుదలచేసిన నిధులు విభాగాలవారీగా..

వైద్యారోగ్యశాఖ  
సీఎం ఇన్సెంటివ్‌
పోలీస్‌శాఖ
పౌరసరఫరాలశాఖ
రెవెన్యూశాఖ
రూ.797.69 కోట్లు
రూ.88.07 కోట్లు
రూ.53.53 కోట్లు
రూ.2,446.96
రూ.23.84 కోట్లుlogo