బడంగ్‌పేట, జూలై 30: బీజేపీకి ఆ పార్టీ వనపర్తి జిల్లా ఇన్చార్జి, బీజేవైఎం స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ టేకుల భాస్కర్‌రెడ్డి షాకిచ్చారు. భారీ అనుచరగణంతో ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్‌గూడ జేఎన్‌ఎన్‌యూఆర్ కాలనీకి చెందిన భాస్కర్‌రెడ్డి సహా 400 మంది గులాబీ కండువా కప్పుకొన్నారు. వారికి బీఆర్ఎస్ కండువా కప్పి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరానని తెలిపారు.
తాను మొదటి నుంచీ బీజేపీలో పనిచేశానని.. కానీ, ఆ పార్టీ ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని తెలుసుకొని బీఆర్ఎస్లో చేరినట్టు స్పష్టంచేశారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో బీజేపీ బడంగ్‌పేట ఉపాధ్యక్షుడు బంగారు బాబు, మాజీ వార్డు సభ్యులు చిర్ర నర్సింహ, బీజేపీ యువజన విభాగం కార్యదర్శి సాయి సంజయ్, బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లేశ్‌నాయక్, మాజీ ఉప సర్పంచ్ చిర్ర శ్రీధర్ కుమార్, పోలింగ్ బూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ సహా 400 మందది పైచిలుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మరో 20 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైతం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.