హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ): తెలంగాణ సెక్రటరియేట్ వద్ద నగరానికి చెందిన ఓ యువకుడు శనివారం హల్చల్ చేశాడు. 72వ మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో అక్కడ వివిధ దేశాల జెండాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వాటిలోని ఇజ్రాయెల్ జాతీయ పతాకాన్ని జకీర్ అనే యువకుడు తొలగించాడు. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ జెండాను తొలగిస్తున్నట్టు ఈ సందర్భంగా నిందితుడు పేర్కొన్నాడు. ఘటన సమయంలో స్థానికులు తీసిన వీడియో వైరల్‌గా మారింది.
అనంతరం గుర్తించిన అధికారులు తిరిగి ఇజ్రాయెల్ జెండాను ఏర్పాటు చేశారు. అదే యువకుడు ఆ జెండాను మళ్లీ తొలగిస్తూ లైవ్ వీడియో పెట్టాడు. దీంతో సైఫాబాద్ పోలీసులు స్పందించి నిందితుడు జకీర్‌పై కేసులు నమోదు చేశారు. జాతీయ జెండాను తొలగించే అగౌరవకరమైన చర్యగా పేర్కొం టూ క్రైమ్ నంబర్లు 138/2025, 141/ 2025 కింద రెండు కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
మిస్‌వరల్డ్ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక దేశ జెండాను తొలగిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. జకీర్ ఆ జెండాను తొలగించే క్రమంలో అతనికి సహకరించిన వారు కూడా ఉన్నారని, వారిపైనా కేసులు నమోదు చేయాలని, ఈ విషయంలో పోలీసులు సీరియస్‌గా వ్యవహరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.