వరంగల్, జనవరి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్న టెక్నోజియాన్-2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నిట్ల నుంచి 15 వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. టెక్నోజియన్లో 40 టెక్నికల్ ఈవెంట్లను ప్రదర్శించనున్నారు.
టెక్నోజియాన్-24 నిర్వహణపై నిట్ డైరెక్టర్ విద్యాధర్ సుబుధి గురువారం ఇక్కడి సెనేట్హాల్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. వరంగల్ నిట్లో 2006 నుంచి టెక్నోజియాన్ మొదలైందని, సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. టెక్నోజియాన్లో ముఖ్యఅతిథిగా ఏరోస్పేస్, మిస్సైల్ సైంటిస్ట్, తిరుచ్చి నిట్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసన్ సౌందరరాజన్ పాల్గొంటారని చెప్పారు.
ఆయన డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్మెం ట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)కు చెందిన బ్రహ్మో స్, అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్ వంటి ప్రతిష్ఠాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన, ఉత్పత్తి, అభివృద్ధిలో కీలకంగా పనిచేశారని తెలిపారు. ప్రస్తుతం విద్య, రక్షణ ఏరోస్పేస్ కన్సల్టెంట్గా పని చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ డీ శ్రీనివాసచార్య, టెక్నోజియాన్ ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ హరిప్రసాద్రెడ్డి, స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ హరికృష్ణ, ప్రొఫెసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.