హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో బుధవారం సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్ మొరాయించడంతో రెండు గంటలపాటు విద్యార్థులు తిప్పలు పడ్డారు. ఒకవైపు వర్షం పడుతుండటం, మరోవైపు సాంకేతిక సమస్య తలెత్తడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. సికింద్రాబాద్‌లోని ఓ సెంటర్లో తాము వర్షంలో తడవాల్సి వచ్చిందని విద్యార్థులు వాపోయారు. ఎట్టకేలకు అధికారులు స్పందిం చి సాంకేతిక సమస్యను పరిష్కరించారు.
జూన్ 28న ప్రారంభమైన వెబ్ కౌన్సెలింగ్‌కు ఈ నెల 7 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశమున్నది. మంగళవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టారు. అటూ రిజిస్ట్రేషన్, ఇటూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టడంతో బుధవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఎట్టకేలకు సమస్యను పరిష్కరించారు. ఈ విషయంపై ఎప్‌సెట్ క్యాంపు ఆఫీసర్ బీ శ్రీనివాస్‌ను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.
ఎప్‌సెట్ వెబ్‌కౌన్సెలింగ్‌కు బుధవారం వరకు 83,378 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 22,827 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఈ నెల 6 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 13న మాక్ సీట్ల కేటాయింపు ఉంటుం ది. 14, 15న ఆప్షన్లు మార్చుకోవచ్చు. 18న సీట్లు కేటాయిస్తారు. 18 నుంచి 22 వరకు కాలేజీల్లో రిపోర్ట్చేయాల్సి ఉంటుంది.