హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌లకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా టీహబ్ ముందుకు సాగుతున్నది. కేవలం టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్‌లకే కాకుండా నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలను చూపదల్చుకొన్న స్టార్టప్‌ల నిర్వాహకులను సైతం వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నది. ఇలాంటి వారికి మార్గదర్శనం చేసేందుకు టీహబ్‌లో దాదాపు 65 మంది నిపుణులు ఉన్నారు.
కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా పట్టణాలు, పల్లెటూళ్ల నుంచి సరికొత్త ఆలోచనలతో వచ్చే స్టార్టప్‌లకు టీహబ్‌లో ఇతోధిక అవకాశాలను కల్పిస్తున్నారు. స్టార్టప్‌ల ఏర్పాటుకు వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే విదేశీయులను సైతం ముందుకు నడిపిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యంత అనుకూలమైన స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా టీహబ్ గుర్తింపు పొందింది. అత్యుత్తమ స్టార్టప్ ఎకో సిస్టంతో విదేశాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకొన్నది.
53 మంది నిపుణులతో కార్యకలాపాలు
అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయి స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా టీహబ్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాల విస్తరణ, పరిశ్రమలతో భాగస్వామ్యం అయ్యేందుకు ‘టీ-కనెక్ట్’ పేరిట టీహబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కార్పొరేట్ కంపెనీ తరహాలో స్టార్టప్ కల్చర్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నది. ప్రస్తుతం టీహబ్‌లో స్టార్టప్ రంగానికి సంబంధించిన 53 మంది నిపుణులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వివిధ రకాల కార్యకలాపాల నిర్వహణకు నిరంతరం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వాటిని ఆయా రంగాలకు చెందిన నిపుణులు, పరిశ్రమల ముందు ఉంచి వారిని సైతం భాగస్వాములను చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆటోమొబైల్ విభాగంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ‘రెనాల్ట్-నిస్సాన్ ఓపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను నిర్వహిస్తున్నారు. మారుతి సుజుకీ కంపెనీతో కలిసి ‘మొబిలిటీ చాలెంజ్’ను చేపట్టారు. వీటితోపాటు పలు ఇతర రంగాలకు సంబంధించిన స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్ వేదికగా నిరంతరం వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి.