SC Gurukula Society | హైదరాబాద్, జనవరి6 (నమస్తే తెలంగాణ): ఫస్టియర్ పరీక్షలు పూర్తయ్యాకే సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ల్లో(సీవోఈ) సెకండియర్ సిలబస్ బోధన ప్రారంభించాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ నిర్ణయించింది. సొసైటీ పరిధిలోని 38 సీఈవోల్లో విద్యార్థులకు ఇంటర్ విద్యతోపాటు, సమానంగా జేఈఈ, నీట్ పరీక్షలకు సైతం శిక్షణ అందిస్తున్నది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు పూర్తయ్యాక సెకండియర్ సిలబస్ బోధిస్తారు.
కానీ పరీక్షలు పూర్తికాకముందే ఈ నెల నుంచే ఫస్టియర్ విద్యార్థులకు సెకండియర్ సిలబస్ బోధించాలని అధికారులు నిర్ణయించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఎట్టకేలకు సొసైటీ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఫస్టియర్ పరీక్షలు పూర్తయ్యాకనే సెకండియర్ సిలబస్ బోధించాలని సీఈవో ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : యూనివర్సిటీల వీసీల ఎంపికపై యూజీసీ స్పష్టత ఇచ్చింది. వీసీగా కొనసాగుతున్న వారు మళ్లీ వీసీ పోస్టుకు దరఖాస్తు చేయడంతోపాటు అదే వీసీ సెర్చ్ కమిటీ సభ్యుడి ఎంపికను చేపడితే అనర్హత వేటు పడుతుందని స్పష్టంచేసింది. పాలకమండలి నామినిలు సైతం పాత వీసీల కోసం పట్టుబట్టిన ఘటనల నేపథ్యంలోనే ఇలాంటి వారిపై అనర్హత వేటు వేయవచ్చని యూజీసీ తెలిపింది.
జాతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఫ్యాకల్టీ నియామకానికి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు నిబంధనలు-2025 పేరుతో డ్రాఫ్ట్ మార్గదర్శకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ ఢిల్లీలో విడుదల చేశారు. వైస్చాన్స్లర్ల పదవీకాలం ఐదేండ్లు ఉంటుందని యూజీసీ వెల్లడించింది. లేదా 70 ఏండ్ల వయసు వచ్చే వరకు వారు పదవిలో కొనసాగవచ్చని తెలిపింది. మన రాష్ట్రంలో వీసీల పదవి కాలపరిమిది మూడేండ్లుగా ఉంది. యూజీసీ మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలుచేయాల్సి వస్తే వీసీల పదవీకాలం మూడేండ్లకే పరిమితం చేస్తారా.? లేక ఐదేండ్లకు పెంచుతారా..? అన్నది సందిగ్ధంగా మారింది.