హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులకిచ్చే స్కూల్ కిట్లలో వివక్ష చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి విద్యాశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గురుకులాలు, సర్కారు బడులపై సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోని విద్యార్థులకు 22 వస్తువులతో కూడిన స్కూల్ కిట్లు ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ పాఠశాలల్లోని విద్యార్థులు 22 వస్తువులతో కూడిన కిట్లు అందుతాయని ఆశించారు. వీరి ఆశలపై సర్కార్ నీళ్లు చల్లింది. పాఠశాల విద్యాశాఖ మాత్రం సర్కార్ స్కూళ్లలోని విద్యార్థులకు 4 వస్తువులతో(బ్యాగ్, షూస్+సాక్స్, బెల్ట్, ఐడీకార్డు) కూడిన కిట్ ఇస్తామంటున్నది. ఇందుకు రూ.200కోట్ల అవుతుందని అంచనా వేసింది. సమగ్రశిక్ష బడ్జెట్ నుంచి ఖర్చుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
సర్కార్ విద్యార్థులపై వివక్ష తగదు..
సర్కార్ ఇస్తామంటున్న 22 వస్తువుల కిట్ గురుకుల విద్యార్థులకే ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ కిట్లో యూనిఫాం, టై, బ్యాగ్, బెల్ట్, ట్రాక్సూట్, బ్ల్లేజర్, పీటీ డ్రెస్, 12 రకాల స్టేషనరీ వస్తువులు ఉండనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో 24వేలకు పైగా సర్కార్ బడులుండగా, వీటిల్లో 16 లక్షల మంది విద్యార్థులున్నారు. గురుకులాలు 1,200 పైచిలుకు ఉండగా, విద్యార్థుల సంఖ్య 4.7 లక్షలు మాత్రమే. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులపై సర్కార్ వివక్ష చూపుతున్నదని, తక్కువ విద్యార్థులున్న గురుకులాలకు ప్రాధాన్యం ఇస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని సర్కార్ బడులు ఆదరణ కోల్పోతున్నాయి. ప్రభుత్వమే ఇలా వివక్ష చూపడంతో సర్కార్ బడులు మరింత ఆదరణ కోల్పోతాయని టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సర్కార్ బడుల్లోని విద్యార్థులపై వివక్ష తగదని సోషల్మీడియాలో విద్యారంగ నిపుణులు, టీచర్లు పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ విద్యార్థులకూ 22 వస్తువులతో కూడిన కిట్లు అందజేయాలని కోరుతున్నారు.