హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ‘డీఏలు అడిగితే ప్రమాద బీమా.. పీఆర్సీ అడిగితే పిడికెడన్నం.. బకాయిలు అడిగితే, బడుల సంఖ్య కుదింపు.. ఓల్డ్ పింఛన్ అడిగితే, ఓట్ల లెక్కల మదింపు.. అప్పుడే పుణ్యకాలం సగం గడిచిపోయింది. నమ్ముకున్న ఉద్యోగుల బతుకులన్నీ ఆగం’ ఇది తాజా పరిణామాల పట్ల ఓ సర్కారీ టీచర్ అవేదన. ప్రభుత్వ టీచర్లకు బడుల్లోనే మధ్యాహ్న భోజనం, బ్రేక్‌ఫాస్ట్ సమకూర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలొస్తున్నాయి. టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తమకు మధ్యాహ్న భోజనం అవసరం లేదని, పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడితే చాలునని సర్కార్‌కు సూచిస్తున్నాయి. టీచర్లకు అన్నం పెట్టి.. డీఏలకు సున్నం పెట్టి.. పీఆర్సీకి కన్నం పెడుతారా? అని ప్రశ్నిస్తున్నాయి. తమకు కావాల్సింది టిఫిన్లు, భోజనాలు కాదని, డీఏలు, పీఆర్సీలు, పెండింగ్ బకాయిల గురించి క్యాబినెట్లో చర్చించాలని కోరుతున్నారు.
గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో టీచర్లకు మధ్యాహ్న భోజనం, బ్రేక్‌ఫాస్ట్ ఉచితంగా సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని మెజారిటీ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది సమాజంలో టీచర్లను చులకన చేసే నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. పైగా ఇది రాష్ట్ర క్యాబినెట్లో తీసుకోవాల్సిన నిర్ణయమా? ఇది అని ప్రశ్నిస్తున్నాయి. టీచర్లంటే లెక్కలేకుండా పోయింది.. అంతా పెన్‌డౌన్ చేసి, మూకుమ్మడిగా సెలవులు, రాజీనామాలు చేస్తే గానీ సమస్యలు పరిష్కారమయ్యేట్టు లేవని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటన తర్వాత టీచర్లు సోషల్‌మీడియా వేదికగా తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు. తమ అసలు డిమాండ్లు, సమస్యలను పక్కనపెట్టి కొసరు వాటిని తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వరాలిమ్మంటే అడుగనివి గుప్పిస్తున్నదని టీచర్ల సంఘాల నేతలంటున్నారు. ఈ అడుగని వరాలు ఏంది స్వామీ? అని ప్రశ్నిస్తున్నారు. ‘ఉద్యోగులు హెల్త్‌కార్డులు అడిగితే సర్కారేమో రూ.1.2 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఇదిలా ఉంటే గత జూన్ 12 శుక్రవారం పాఠశాలలు ప్రారంభంకావాల్సి ఉన్నది. 13 రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో శుక్రవారం సెలవు ఇచ్చింది. మేము సెలవులివ్వాలని అడుగలేదు. సోమవారం స్కూళ్లు ప్రారంభమైనా అమావాస్య, మంగళవారం సెంటిమెంట్లతో జూన్ 16న విద్యార్థులు బడిబాట పట్టాల్సి వచ్చింది. టీచర్లు, లెక్చరర్లు ఏం అడుగుతున్నారో ప్రభుత్వనికి అనవసరం. అడుగనివి.. అస్సలు ఊహించనివి మాత్రం వరాల రూపంలో ఊడిపడుతాయి ఏంటో..?’ అంటూ రిటైర్డ్ హెడ్మాస్టర్ మానేటి ప్రతాప్‌రెడ్డి విస్మయం వ్యక్తంచేశారు.
విద్యార్థులు, టీచర్లు, విద్యావ్యవస్థ అవసరం కంటే ప్రభుత్వ ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘హక్కుల కోసం అడిగితే నోరుమెదపరు. అడుగని భోజనాలు, టిఫిన్లు పెట్టి టీచర్లను ఉచితాల కోసం ఆశపడేవారిగా చిత్రీకరిస్తున్నారని భాషోపాధ్యాయ సంస్థ రా్రష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో టీచర్లు మరింత చులకనవుతారని వాపోయారు. ప్రజల్లో టీచర్లను బద్నాం చేయడానికి కాకపోతే ఈ కొత్త వింత ఏమిటని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని సర్కార్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ సదానందం, జట్టు గజేందర్ సైతం ఈ నిర్ణయాన్ని ఉపసంహించుకోవాలని కోరారు.
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయులు, అధ్యాపకులకు విద్యార్థులతోపాటు అల్ఫాహారం, భోజనం ఉచితంగా అందించాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఉపాధ్యాయులకు ఉచితంగా భోజనం, అల్ఫాహారం సౌకర్యాలు కల్పిస్తామనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, వారికి రావాల్సిన డీఏలు, పీఆర్సీ వంటి ఆర్థిక ప్రయోజనాలు తీర్చాలని కోరారు. ఇప్పటికే సమాజంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు అధిక జీతాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారని, ఇప్పుడు పిల్లల భోజనం కూడా తింటున్నారని ఆడిపోసుకుంటారని వాపోయారు.
ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వెచ్చించే ఆ ఖర్చును పిల్లల కొరకే ఖర్చు చేస్తే నాణ్యమైన భోజనం పెట్టవచ్చని, టీచర్లను బద్నాం చేయవద్దని విజ్ఞప్తిచేశారు. క్యాబినెట్ ఇంత చిన్న విషయంపై నిర్ణయం తీసుకోవడం అంతా గౌరవప్రదం కాదని, వారికి ఇవ్వవలసిన 6 డీఏలు వెంటనే ప్రకటించాలని కోరారు. పీఆర్సీ కాలపరిమితి ఇప్పటికే మూడేండ్లు ముగిసిందని, మరో 24 నెలలు మాత్రమే ఉన్నదని గుర్తుచేశారు. ఈహెచ్ఎస్ విషయంలో కూడా ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొన్నదని పేర్కొన్నారు. ఇప్పటికీ ఈహెచ్ఎస్ అమలు కాలేదని, అయినప్పటికీ.. మే, జూన్ నెల 1.5% వేతనాల్లో కోత విధించారని హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజనం, బ్రేక్‌ఫాస్ట్ కావాలని ఎవరు అడిగారు? ఎవరు కావాలని అడిగితే సర్కార్ ఈ నిర్ణయం తీసుకొన్నదని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసొసియేషన్ ప్రశ్నించింది. ఇలాంటి వాటిని ప్రకటించడం అర్థరహితమని సంఘం అధ్యక్షుడు షౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శి రోహిత్‌నాయక్ పేర్కొన్నారు. బడుల్లో మౌలిక వసతులు కల్పించరు. టీచర్ల కొరత తీర్చరు. కానీ, ఇలాంటి వాటిని ప్రకటిస్తారు. వీటివల్ల లాభమేందని అసహనం వ్యక్తంచేశారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీలు అడిగితే.. ఇలాంటివి ప్రకటించడం శోచనీయమని మండిపడ్డారు. తక్షణమే పీఆర్సీ, డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
టీచర్లకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం సమకూరుస్తామన్న ప్రభుత్వ ప్రకటనను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది అత్యంత అభ్యంతరకరమని, టీచర్లకు అగౌరవమని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వోద్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య అభిప్రాయపడ్డారు. టీచర్లకు బదులు నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని, విద్యార్థులకిచ్చే భోజన చార్జీలను రూ.15 పెంచాలని డిమాండ్ చేశారు. రేట్లు పెంచకుండా, టీచర్లకు ఇస్తున్నామంటూ పబ్లిసిటీ చేసుకోవడం టీచర్లను అగౌరవపరచడం
సరికాదని పేర్కొన్నారు.
టీచర్లకు మధ్యాహ్న భోజనం, టిఫిన్లు పెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని పీఆర్టీయూ టీఎస్ డిమాండ్ చేసింది. భోజనాలు, టిఫిన్లు కావాలని ఉపాధ్యాయులు అడుగలేదని.. తమ భోజనం, టిఫిన్లు తామే తెచ్చుకొంటామని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్‌రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని టీచర్లంతా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, స్కూళ్లను బలోపేతం చేస్తున్నారని గుర్తుచేశారు. అడిగిన డిమాండ్లు నెరవేర్చాలే కానీ, అన్నం పెడుతున్నం.. టిఫిన్లు పెడుతున్నామన్న ప్రకటనను విరమించుకోవాలని పునరుద్ఘాటించారు.
బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం పెడుతామనడం టీచర్లను చులకన చేయడమే అవుతుందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్‌యూపీపీ టీ) అభిప్రాయపడింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. డీఏలు, పీఆర్సీలు ఇవ్వకుండా దాటవేస్తూ.. ఉచిత భోజనం పేరిట టీచర్లు, ఉద్యోగులను సర్కార్ ప్రలోభపెట్టాలనుకుంటున్నదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ అబ్దుల్లా, గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ అభిప్రాపడ్డారు.