హైదరాబాద్/ కవాడిగూడ, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేయాలని, పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఒక వేళ కాంగ్రెస్ సర్కారు రద్దు చేయకపోతే సీపీఎస్‌ను రద్దుచేసే ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి తీరుతుందని స్పష్టంచేశారు. సీపీఎస్ రద్దు కోసం రాష్ట్రప్రభుత్వంతోనే కాకుండా.. కేంద్ర ప్రభుత్వంతోను యుద్ధం చేసేందుకు వెనుకాడబోమని అన్నారు. పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో సోమవారం టీచర్లు మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్లు ధర్నాచౌక్‌లో బ్లాక్ మార్చ్‌ను నిర్వహించారు. నల్లచొక్కాలు, టీషర్టులు ధరించి ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దుచేసే అద్భుత అవకాశం చరిత్రలో ముఖ్యమంత్రికి.. ఏ నేతకు రాలేదని, ఇలాంటి అవకాశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. పాత పింఛన్ సాధించే వరకు తాము విశ్రమించబోమని స్పష్టంచేశారు.
రెండేండ్లయినా కాంగ్రెస్ సర్కారు సీపీఎస్‌ను రద్దు చేయకపోవడం వల్లనే తాము ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని శ్రీపాల్‌రెడ్డి చెప్పారు. సర్కారుతో జేఏసీ చర్చల్లోనూ సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రస్తావించామని, మం త్రుల కమిటీ వేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఈ కమిటీ ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ధర్నాతో ప్రభుత్వంలో కదలిక వస్తుందని ఆశిస్తున్నామని, తదుపరి కార్యాచరణ విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు.