తాంసి, ఆగస్టు 26: పాఠశాలలో అందరి ముందు ఓ విద్యార్థి తండ్రి తనపై చేయి చేసుకొన్నాడన్న అవమాన భారంతో ఓ ఉపాధ్యాయుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం ఘోట్కూరికి చెందిన తాటి విలాస్ (45) మావల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పని చేస్తున్నాడు. ఈ నెల 17న ముగ్గురు విద్యార్థులను ఆయన మందలించారు. మరుసటి రోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఓ విద్యార్థి తండ్రి ఎన్ శ్రీకాంత్ విద్యార్థులు చూస్తుండగానే విలాస్‌పై చేయి చేసుకున్నాడు. విలాస్ తీవ్ర మనస్తాపానికి గురవ్వడంతో తోటి ఉపాధ్యాయులు ఓదార్చారు. గురువారం భార్యాపిల్లలతో కలిసి విలాస్ స్వగ్రామం ఘోట్కూరికి వెళ్లాడు. రాత్రి రెండు గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికినా కనిపించలేదు. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని బావిలో తాటివిలాస్ మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. విలాస్ భార్య తాటి లావణ్య ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై కేశవ్స్వామి తెలిపారు.