మన ఊరు-మన బడికి ప్రత్యేక
సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన టీసీఎస్
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఉద్దేశించిన మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమానికి సంబంధించిన అనుమతులన్నీ కాగితరహితంగా, ఆన్లైన్లోనే మంజూరు చేయనున్నారు. అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సిద్ధంచేసింది. తొలుత ఆంధ్రప్రదేశ్ వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించినప్పటికీ, కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టీఎస్ఎస్కు అప్పగించారు. దీనిపై సోమ, మంగళవారాల్లో అధికారులు టీసీఎస్‌తో చర్చించినట్టు తెలుస్తున్నది. సంబంధిత అధికారులు తమ లాగిన్ ఐడీ ద్వారా మాత్రమే ఆన్లైన్లోనే ఫైళ్లను పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలలను పరిశీలించి, స్థితిగతులను నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే సాఫ్ట్వేర్ ద్వారా అంచనాలను రూపొందిస్తామని విద్యాశాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు.
ప్రక్రియ ఇలా..
పాఠశాలల్లో చేపట్టే వివిధ పనులకు సంబంధించిన అంచనా వ్యయాలను ఆయా ఇంజినీరింగ్ విభాగాలు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేస్తాయి. అంతకు మించి ఎవరైనా అంచనాలను, పనులను నమోదు చేసినా వాటిని సాఫ్ట్వేర్ అంగీకరించదు.
ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క అంశానికి విడిగా అంచనాలు రూపొందించి ఒకే ప్రాజెక్ట్‌గా పరిగణిస్తారు.
ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే ఇసుక ఆయా పాఠశాలలకు సమీపంలో ఎక్కడ లభిస్తుందన్న వివరాలు కూడా నమోదుచేస్తారు.
క్షేత్రస్థాయిలోని అసిస్టెంట్ ఇంజినీర్ సిద్ధం చేసిన అంచనాలను అప్రూవల్ కోసం ఆన్లైన్లోనే డిప్యూటీ ఈఈకి, అక్కడి నుంచి ఈఈ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)కి పంపాల్సి ఉంటుంది. డీఈవో ఆన్లైన్లో ప్రతిపాదనలు పంపితే జిల్లా కలెక్టర్ పరిపాలనాపరమైన అనుమతులు జారీచేస్తారు.
అనంతరం పనులను సాంకేతిక అనుమతి కోసం ఇంజినీరింగ్ విభాగానికి పంపిస్తారు. అక్కడి నుంచి ఆయా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లకు సాంకేతిక అనుమతులు మంజూరవుతాయి. అనంతరం మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 15 శాతాన్ని రివాల్వింగ్ ఫండ్‌గా చెల్లిస్తారు. ఈ అడ్వాన్స్ చెల్లించేందుకు కలెక్టర్ నుంచి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు చేరుతాయి. అక్కడి నుంచి ఎస్ఎంసీ ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. ఈ ప్రక్రియ మొత్తం టీసీఎస్ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతుంది.