గోదావరిఖని, సెప్టెంబర్ 21: సింగరేణి కార్మికులకు 33 శాతం వాటా కింద రూ.1,550 కోట్లు ఇవ్వాల్సిందేనని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులు మునుపెన్నడూ లేనంతగా రూ.70.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి, రికార్డుస్థాయిలో బొగ్గు రవాణా చేశారని వివరించారు.
2023-24 వార్షిక సంవత్సరానికి రూ.4,701 కోట్ల నికర లాభం వచ్చినట్టు ప్రభుత్వం పేర్కొన్నదని, అందులో కార్మికులకు 33 శాతం వాటా రూ.1,550 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.796 కోట్లు మాత్రమే ఇవ్వడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలని నిలదీశారు. ప్రతి కార్మికుడికి లాభాల్లో వాటా కింద రూ.4 లక్షలు రావాల్సి ఉన్నదని, కానీ ప్రభుత్వం చేసిన మోసానికి గెలిచిన కార్మిక సంఘం వంతపాడటంతో ఒక్కొక్కరికి రూ.2 లక్షల మేర లాభాలను తగ్గించారని విమర్శించారు. ప్రభుత్వం, సింగరేణి గుర్తింపు సంఘం మెసాన్ని ఎండగట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు.