కృష్ణకాలనీ, జూలై 18: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను( Coal blocks) వేలం వేయడాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య(Sammaiah) డిమాండ్ చేశారు. దేశంలోని 60 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ను గురువారం ముట్టడించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య ఆధ్వర్యంలో ఏరియా నుంచి పలువురు నాయకులు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా బడితల సమ్మయ్య మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి రాగానే త్వరగతినా 60 సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేసి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌కు అప్పగించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం వల్ల దేశంలో అనేకమంది ఉద్యోగాలు కోల్పోయి, వారి కుటుంబాలు రోడ్డు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలోని శ్రావణపల్లి ఓసీని వేలం వేయడానికి కేంద్రప్రభుత్వం సిద్ధపడిందని, తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని అడ్డుకోకపోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి, దేశంలో 60 బొగ్గు బ్లాకులను సింగరేణికే అప్పగించి, కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని, లేకుంటే టీబీజీకేఎస్ ఆద్వర్యంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.