కొత్తగూడెం సింగరేణి, జూన్ 4 : సింగరేణి దవాఖానలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు ఎదుట నాయకులు బుధవారం దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు దీక్షకు మద్దతు పలికి మాట్లాడారు. సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంలో యాజమాన్యం అలసత్వం వీడాలని డిమాండ్ చేశారు. కార్మికుల కష్టంతో సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తున్నా వారికి మెరుగైన వైద్యం అందించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంవహిస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికులకు అనేక హక్కులు కల్పించారని గుర్తుచేశారు. ఈ దీక్షలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ తదితరులు మాట్లాడారు. అనంతరం తొమ్మిది డిమాండ్లలో కూడిన వినతిపత్రాన్ని డైరెక్టర్(పా)కు, ప్రాజెక్టు అండ్ ప్లానింగ్‌కు అందజేశారు.