హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తమ జీవన మనుగడ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. చట్టబద్ధత లేని ఉచిత బస్సు స్కీంపై కోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. తమ కష్టాలపై పౌర హక్కుల నేతలు స్పందించాలని కోరారు.
బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆటో మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఆటో కార్మికుల సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఆటో డ్రైవర్లు తరలివచ్చారు. ఈ సదస్సులో టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని చెప్పారు. కానీ, ఆ స్కీం కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆరు లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాల గురించి ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కాదని, తమ బతుకు పోరాటమని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వంలో అనేక ప్రయోజనాలు
కేసీఆర్ ప్రభుత్వంలో ట్యాక్సీల మాఫీ, 714 జీవో రద్దు, వాహన మోటర్ త్రైమాసిక పన్ను, రూ.5 లక్షల బీమా తదితర ప్రయోజనాలు కలిగాయని మారయ్య చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆటో డ్రైవర్ల మనుగడే ప్రశ్నార్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో ఆటో కార్మికుల సమస్యలపై వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. జనవరి 7న ఇందిరా పార్కు వద్ద భారీ సభ నిర్వహిస్తామని చెప్పారు. కాగా, బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్‌భవన్ వద్ద ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని ఎస్ఎన్ రెడ్డి భవన్లో ఆటోడ్రైవర్లు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.