హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐను అత్యాధునిక ఉపాధి శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఐటీఐలలో కాలం చెల్లిన కోర్సులను రద్దుచేసి, భవిష్యత్తు కాలానికి పనికివచ్చే కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. యువతకు ప్రపంచంతో పోటీపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని అన్నారు. సచివాలయంలో శనివారం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐటీఐల్లో దాదాపు రూ.2 వేల కోట్లతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి సిద్ధమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ నిర్ణయాన్ని సీఎం స్వాగతించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర పభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని తెలిపారు. టాటా సంస్థతో తమ ప్రభుత్వం కలసి పనిచేస్తుందని, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సంస్థతో ఎంవోయూను కుదుర్చుకోవడానికి ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. యువతకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రొబోటిక్స్ తయారీ, అధునాతన సీఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫయర్ లాంటి 4.0 పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో నైపుణ్యం అందించడానికి టాటా సంస్థ ముందుకు రావడం శుభపరిణామమని చెప్పారు.
రాష్ట్రంలో దాదాపు లక్షమంది విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతలో శిక్షణ ఇచ్చేందుకు టాటా సంస్థ ముందుకు వచ్చింది. 4.0 సిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతోపాటు వాటి నిర్వహణకు కావాల్సిన మెషినరీ, పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను ఈ సంస్థ అందిస్తుంది. శిక్షణకు ప్రతి ఐటీఐలో ఇద్దరు మాస్టర్ ట్రెయినర్లను టాటా నియమిస్తుంది. ఈ ప్రాజెక్టును ఐదేండ్లపాటు ఉచితంగా అందిస్తారు. సాంకేతిక వర్షాపులు, తయారీ రంగంలో ఉపాధి కల్పించడానికి 22 నూతన స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ప్రాజెక్ట్‌లో టాటా సంస్థ అందిస్తుంది.
దీనికి సంబంధించి ఎంవో యూ విధివిధానాలు ఖరారు చేయడానికి రాష్ట్ర ఉపాధికల్పన, కార్మిక శాఖ, టాటా టెక్నాలజీతో సంప్రదింపులు జరుపుతున్నది. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, కార్మిక, ఉపాధికల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, సీఎంవో అధికారులు శేషాద్రి, షానవాజ్, అజిత్‌రెడ్డి, టాటా టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రసిడెంట్ పీవీ కౌల్గుడ్, గ్లోబల్ హెడ్ వైస్ ప్రసిడెంట్ సుశీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.