హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): భావవ్యక్తీకరణలో భాష కీలకమని, భాష ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించవచ్చని కార్మిక, ఉపాధి కల్పన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీకుముదిని అన్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టాంకాం) సంస్థ జపాన్‌లో నర్సింగ్ ఉద్యోగాలకు తర్ఫీదునిచ్చేందుకు ఏర్పాటు చేసిన రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతో టాంకాం సంస్థ జపాన్‌లో నర్సింగ్‌లో ప్లేస్మెంట్ పొందేందుకు రెండో విడతగా 25 మందిని ఎంపిక చేయగా, వీరికి 6 నెలలపాటు జపాన్ భాషలో శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా రాణికుముదిని మాట్లాడుతూ రోగుల భావోద్వేగాలు తెలుసుకోవడంలో భాష చాలా ప్రధానమైనదని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ జపాన్ దేశ ప్రజలతో కలిసి పనిచేయాల్సి ఉన్నందున భాషా పరిజ్ఞానం పెంచుకొని వృత్తిలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి, టాంకాం సీఈవో విష్ణువర్ధన్‌రెడ్డి, టాంకాం జీఎం నాగభారతి, అధికారులు విద్యుల్లత, విద్యావతి, నరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.