హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరో రాష్ట్రం తమకూ తెలంగాణ పథకాలు కావాలని కోరుకొంటున్నది. ఇప్పటికే తెలంగాణ రైతు పథకాలు తమకు వర్తింపజేయాలని మహారాష్ట్ర, కర్ణాటక రైతులు డిమాండ్ చేస్తుండగా.. తాజాగా తమిళనాడు రైతుసంఘాలు ఆ దిశగా ఏకంగా ఉద్య మ కార్యాచరణకే సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి విధానాలు, రైతు సంక్షేమ పథకాలను తమిళనాడులోనూ అమలుపర్చాలని దక్షిణ భారత రైతు సమాఖ్య డిమాండ్ చేసింది.
తెలంగాణ మాడల్ అమలు కోసం త్వరలో కన్యాకుమారి నుంచి చెన్నై వరకు వేలాదిమంది రైతులతో పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించింది. అంతకుముందు తమిళనాడు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తామని వెల్లడించింది. తెలంగాణలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న అభివృద్ధి మాడల్‌పై శనివారం కోయంబత్తూర్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతు అనుకూల పథకాలను అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు. తెలంగాణలో రైతులు ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని చెప్పారు. తెలంగాణలో అటవీ విస్తీర్ణం పెంపుదల, పర్యావరణ పరిరక్షణ, సాగునీరు, విద్యుత్తు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, సేవారంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. సమాఖ్య సభ్యులు ఇటీవల తెలంగాణలో పర్యటించి ప్రగతిని ప్రత్యక్షంగా చూశారని చెప్పారు. సమాఖ్య నిర్ణయానికి సమావేశంలో పాల్గొన్న కోయంబత్తూర్ వ్యవసాయ ఉత్పత్తుల కమిటీ సభ్యుడు వీకేఎస్కే సెంథిల్‌కుమార్, కాంచీపురం జిల్లా అధ్యక్షుడు కేఏజీ హలన్, తమిళనాడు రైతు సంఘం నేతలు తమ మద్దతు ప్రకటించారు.