హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావల్ అకాడమీ (ఎన్ఏ)లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ ఇటీవల నిర్వహించిన రాత పరీక్షలో కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక్ గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉత్త్తీర్ణత సాధించారు. ఆ తర్వాత ఐదు దశల్లో నిర్వహించే కఠినతరమైన ఎస్ఎస్బీ (సర్వీస్ సెలక్షన్ బోర్డు) ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.
ఎంపికైన సైనిక్ పాఠశాల విద్యార్థులు వీ అభిలాశ్, ఆర్ సిద్దార్థ, జీ వినయ్‌కుమార్, జే నర్సింహులు, ఎం విష్షువర్ధన్ను తెలాంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీ సీతాలక్ష్మి, స్కూల్ డైరెక్టర్ కేసీ రావు, ప్రిన్సిపాల్ సీహెచ్ లచ్చయ్య, ఓఎస్డీ పీఎస్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్వ్యూలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉత్త్తీర్ణత సాధించేందుకు ఎంతగానో కృషి చేసిన ఉపాధ్యాయులను కూడా అభినందించారు.