హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తేతెలంగాణ) : హైకోర్టు తీర్పుతో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. కేసీఆర్‌పై కక్షతోనే మేడిగడ్డ పగుళ్లపై రాద్ధాంతం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఈ తీర్పు చెంపపెట్టులాంటిదని అభివర్ణించారు. కాళేశ్వరంపై వేసిన ఘోష్ కమిషన్ 8బీ, 8సీ నోటీసులివ్వకుండా విచారణ చేయడం అభ్యంతరకరమని పేర్కొన్నారు. మేరు పర్వతంలాంటి కేసీఆర్‌పై ఉమ్మేస్తే, తిరిగి కాంగ్రెస్‌పైనే పడిందని దెప్పిపొడిచారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, పార్టీ రాష్ట్ర నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, కే కిశోర్గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెచ్చుకున్న తెలంగాణలో రైతుల మేలు తలంచి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. మేడిగడ్డలోని రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే రేవంత్, రాహుల్ కలిసి ప్రాజెక్ట్ కూలిందని, లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయని దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. మరమ్మతులకు ముందుకొచ్చిన ఎల్అండ్టీని బెదిరించారని ఆయన ఆరోపించారు.
చారిత్రక కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు హర్షణీయం. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టులాంటిది. కమిషన్ నివేదిక ప్రకారం కేసీఆర్, హరీశ్‌రావుపై చర్యలు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. కమిషన్లు, నోటీసుల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ ఘోష్ కమిషన్ విషం కక్కింది. ఈ కమిషన్ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసి మొత్తం తప్పుడు నివేదికలను సృష్టించింది. హైకోర్టు క్లీన్చిట్ ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కంగుతిన్నది. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి కుంగిన కాళేశ్వరం పిల్లర్లకు వెంటనే మరమ్మతు చేయించాలి.

కాళేశ్వరం ప్రాజె క్టు విషయంలో కేసీఆర్ ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర హైకో ర్టు తీర్పుతో భగ్నమైంది. అపర భగీరథుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక అబద్ధపు విచారణ కమిషన్లతో బద్నాం చేయాలని సర్కార్ ప్రయత్నించి విఫలమైంది. .