హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్లో మొత్తం రా రైస్ కాకుండా కొంతమేర ఫోర్టిఫైడ్ రైస్ కూడా ఇస్తామని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తెలిపింది. ఇందుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఆ సంస్థ కమిషనర్ ఇటీవల ఎఫ్‌సీఐకి లేఖ రాశారు. దేశంలో పోషకాల బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) అవసరం ఉన్నదని, వీలైతే సరఫరా చేయాలని గతంలో రాష్ర్టాన్ని ఎఫ్‌సీఐ కోరింది. గత యాసంగిలోనూ ఐదు లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌ను ఎఫ్‌సీఐ రాష్ట్రం నుంచి తీసుకున్నది. ఈ నేపథ్యంలో యాసంగిలో కేంద్రం కోరినట్టుగా మొత్తం రా రైస్ ఇవ్వడం ఇబ్బందిగా ఉండటంతో కొంత మేర ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని పౌరసరఫరాల సంస్థ భా వించింది. కేంద్రం ఎంత కావాలంటే అంత ఇచ్చేందుకు కూడా సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. ఈ విషయమై కేంద్రంతో చర్చించేందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కమిషనర్, అధికారులు మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఎఫ్‌సీఐ, కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని వివరించారు. ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోవడంపై కేంద్రం నుంచి అధికారులకు ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని తెలిసింది. ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పినట్టు సమాచారం.
మిల్లుల్లో మొదటివారం నుంచి తనిఖీలు
గత యాసంగికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) గడువు పొడిగింపుపై కూడా కేంద్రం నుంచి స్పష్టమైన హామీ దక్కలేదు. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో మరో నెల పొడిగించాలని ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ కేంద్రానికి లేఖ రాసింది. సివిల్ సప్లయీస్ కమిషనర్ ఢిల్లీకి వెళ్లి ఎఫ్‌సీఐతోపాటు కేంద్ర ఉన్నతాధికారులతో మాట్లాడారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ దక్కకపోవడంతో వారు తిరుగు ప్రయాణమయ్యారు. గత యాసంగికి సంబంధించి ఇంకా సుమారు 5.50 లక్షల టన్నుల సీఎమ్మార్ ఇవ్వాల్సి ఉన్నది. గురువారం నుంచి మిల్లుల్లో చేపట్టాల్సిన తనిఖీలను ఎఫ్‌సీఐ వాయిదా వేసింది. తనిఖీల వల్ల సీఎమ్మార్‌కు ఆటంకం కలుగుతుందని, తనిఖీలు వాయిదా వేయాలని సివిల్ సప్లయీస్ కమిషనర్ ఎఫ్‌సీఐకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఎఫ్‌సీఐ.. మే మొదటి వారంలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది.
ధాన్యం కొనుగోలుకు మార్గదర్శకాలు
ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. కొనుగోలు కేంద్రా ల వద్ద అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించిం ది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులంతా ఒకేసారి రాకుండా రైతులకు టోకెన్లు ఇవ్వాలని, డిఫాల్ట్ మిల్లర్లకు ఈ సీజన్లో ధాన్యం కేటాయించొద్దని నిర్ణయించింది. ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ర్టాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.