హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/ రంగారెడ్డి, జూలై 6 (నమస్తే తెలంగాణ): యథారాజ.. తథాప్రజ! అన్న నానుడి కాంగ్రెస్ పాలనలో మారిపోతున్నది. యథా సర్కారీ పెద్దలు.. తథా అధికారులు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఇష్టారీతిన భూములను కబళిస్తున్న అధికార పార్టీ పెద్దల పెద్దల తీరును కొందరు అధికారులు స్ఫూర్తిగా తీసుకుంటున్నట్టు కనబడుతున్నది. పైవాళ్లు ఏనుగులు మింగితే, మేం పీనుగులైనా మింగలేమా!.. అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ సర్కార్, అసైన్డ్ భూములు కనిపిస్తే చాలు రాత్రికిరాత్రే స్వాధీనమన్నా చేసుకొంటున్నరు, ఏకంగా రికార్డులనే తారుమారు చేసి అక్రమ రిజిస్ట్రేష న్లు చేస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న సర్కార్ భూములను అధికారులు ఫలహారంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు.
రాత్రికిరాత్రి ప్రభుత్వ భూముల ను రిజిస్ట్రేషన్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చేశారు. ఇందులో భాగంగా మునగనూరు గ్రా మ పరిధిలో ఓ 12 ఎకరాల సర్కార్ భూ మిని ప్రభుత్వ పెద్దల అండ ఉన్న ప్రైవేట్ వ్యక్తులకు తహసీల్దార్ కట్టబెట్టడం తాజాగా వెలుగులోకి వచ్చింది. మునగనూరు-హయత్‌నగర్ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఈ భూమి విలువ ఎకరా రూ.15-20 కోట్ల వరకు ఉంటుంది. కనీసంగా సుమారు రూ.180-240 కోట్ల వరకు విలువ ఉంటుందని అంచ నా. సర్కార్ పెద్దలేమో నిషేధిత జాబితాలో ఉన్న వందలాది ఎకరాలను ప్రైవేట్ కంపెనీల ద్వారా చెరబడుతున్నారు. ఇక్కడ తహసీల్దార్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి.. నిషేధిత జాబితాలో ఉన్న ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఒక బై నంబర్ (సబ్ డివిజన్), నా లా అనుమతులు ఇచ్చే సమయంలో మరో బై నంబర్, చివరకు పహాణీలోకి ఎక్కించిన తర్వాత మరో బై నంబర్.. మూడు బై నంబర్లతో ఏమార్చారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ లం మునగనూరు పరిధిలోని సర్వేనంబరు 44లో 44.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఖాస్రా పహాణీలో అది పొరంబోకు భూమిగా నమోదై ఉన్నది. ఇందులో ఆరుగురు రైతులకు కొన్నేండ్ల క్రితం సుమారు 22 ఎకరాల వరకు అసైన్డ్ చేసినట్టుగా రికార్డులు చెప్తున్నాయి. ఆ తర్వాత వివిధ సంవత్సరాల్లోని పహాణీల్లో మాత్రం 5 సబ్ డివిజన్లుగా ఈ భూమిని పేర్కొంటూ ప్రభుత్వ భూమి/సర్కారీగా నమోదు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం మునగనూరు పూర్తిగా పట్టణీకరణలో మిళితం కావడంతో ఇక్కడ భూముల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా సర్వేనంబరు 44 భూములు మునగనూరు-హయత్‌నగర్ ప్రధాన రహదారిని అనుసరించి ఉండటంతో డిమాండ్ మరింతగా ఉన్నది. ఇలా ఇక్కడ ఎకరం రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ధర పలుకుతుందని స్థానికులు చెప్తున్నారు.
సర్వేనంబరు 44లోని 44.10 ఎకరాలు పూర్తిగా పొరంబోకు అంటే ప్రభుత్వ భూమిగా రికార్డుల్లోనే ఉన్నది. కానీ, 2024లో అప్పటి తహసీల్దార్ రవీందర్ దత్ రాత్రికిరాత్రే అందులో 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసి పట్టాగా మార్చేశారు. రోజుల వ్యవధిలోనే ఆ భూమిని మరొకరి పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుతూ (నాలా) అనుమతులు ఇచ్చేశారు. ఆపై పహాణీల్లో వారి పేర్ల మీద పట్టాగా 12 ఎకరాలు నమోదు చేశారు. ఇందుకోసం సద రు తహసీల్దార్ చాకచక్యంగా సర్వేనంబరుకు 5 డివిజన్లు సృష్టించి ఏమార్చారు.
తొలుత సర్వేనంబరు 44/4లో 7.16 ఎకరాలను కంబాలపల్లి సులోచన అనే మహిళ పేరిట పట్టాగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ మేరకు వచ్చిన పట్టదారు పాస్ పుస్తకం ఆధారంగా 2024 మే 28వ తేదీన మెరుగు గోపాల్ అనే వ్యక్తికి సులోచన విక్రయించినట్టుగా సేల్‌డీడ్ చేశారు. అనంతరం సర్వేనంబరు 44/2లోని 4.25 ఎకరాలను కంబాలపల్లి సులోచన పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ మేరకు వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా 2024 జూన్ 26వ తేదీన సులోచన నుంచి మెరుగు గోపాల్ కొనుగోలు చేసినట్టుగా సేల్‌డీడ్ చేశారు. అంటే రెవెన్యూ రికార్డుల్లోనే పొరంబోకు (ప్రభుత్వ భూమి)గా ఉన్నప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా ఇలా 12 ఎకరాలను మెరుగు గోపాల్ పేరిట మార్చేశారు.
మెరుగు గోపాల్ సర్వేనంబరు 44/2, 44/4ల్లో ఉన్న 12.01 ఎకరాలను నాలా అనుమతి కోసం దరఖాస్తు చేసుకొన్నారు. దీంతో ఆ 12.01 ఎకరాలకు నాలా అనుమతులు సులువుగా ఇస్తూ తహసీల్దార్ రవీందర్ దత్ 15.07.2024న ఉత్తర్వులు (ప్రొసీడింగ్ నం.2400443301) జారీచేశారు. ఈ ప్రొసీడింగ్‌లో మాత్రం 44/4 సబ్ డివిజన్లో ఉన్న 7.16 ఎకరాలను 44/8 సబ్ డివిజన్‌గా పొందుపరిచారు. 4.25 ఎకరాలు ఉన్న 44/2 సబ్ డివిజన్ నంబరును 44/9గా చూపారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈ ఏడాది మార్చి 2వ తేదీన మునగనూరు గ్రామ పహాణీని పరిశీలిస్తే.. 44/10 సర్వేనంబరు 7.16 ఎకరాలు, 44/11 సర్వేనంబర్‌లో 4.25 ఎకరాలు పట్టా.. నాలా అనుమతి ఉన్నట్టుగా న మోదు చేసి పట్టాదారుగా మెరుగు గోపాల్‌ను పేర్కొంటూ 15.7.2024న తహసీల్ద్దార్ రవీందర్ దత్ డిజిటల్ సంతకం కూడా చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ డివిజన్లు 2, 4గా చూపి.. నాలా ప్రొసీడింగ్‌లో వాటిని 8, 11గా మార్చి.. పహాణీలో 10, 11గా నమోదు చేశారు. భూభారతిలోనూ మెరుగు గోపాల్ పేరు మీద 10, 11 సబ్ డివిజన్లలో 12.01 ఎకరాల పట్టా భూమిగా అది నమోదై ఉన్నది.
ఆది నుంచి వచ్చి న రికార్డులు ఒకరీతిన ఉంటే.. తహసీల్దార్ రవీందర్ దత్ మాయాజాలం తర్వాత రెండు సబ్ డివిజన్లలోని 12.01 ఎకరాల భూమి స్వభావం, స్వరూపం మారి ఏకంగా పట్టా భూములుగా మారిపోయాయి. 2025 నవంబరు 3న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి 22ఎ నిషేధిత జాబితా పంపారు. అందులో భాగంగా మునగనూరు గ్రామ పరిధిలోని భూములకు సంబంధించి 44 సర్వేనంబరు వివరాలూ మారిపోయాయి. అందులో కేవలం 44/4లో 7.16 ఎకరాలు, 44/5లో 18.10 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ భూమి (గవర్నమెంట్ ల్యాండ్)గా పొందుపరిచారు. అంటే 19.24 ఎకరాల ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాలో మాయమైంది. మరో విచిత్రమేందంటే? తహసీల్దార్ రవీందర్ దత్ ధారాదత్తం చేసి పట్టాగా మార్చిన 44/4 సబ్ డివిజన్లోని 7.16 ఎకరాలను ఈ జాబితాలో పొందుపరిచారు. దీంతో అసలు మొత్తం సర్వేనంబరు 44పైనే సమగ్ర విచారణ చేస్తే తప్ప మరిన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చేలా కనిపించడం లేదు.
ఎక్కడ ఏ భూ దందాను ముట్టుకొన్నా మూలాలు దాదాపు ‘బిగ్‌బ్రదర్స్’ దగ్గరికే పో తుండటం గమనార్హం. 12.01 ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టాదారుగా మారిన మెరుగు గోపాల్ అనే వ్యక్తి బిగ్‌బ్రదర్ అనుచరుడిగా స్థానికంగా ప్రచారంలో ఉన్నది. మరి.. రూ.180-240 కోట్ల విలువైన భూమిని అమాంతం మింగడమంటే ఆస్థాయి ఆశీర్వాదం ఉంటేనే సాధ్యమనేది బహిరంగ రహస్యం. మెరుగు గోపాల్ ఈ ప్రక్రియలో పొందుపరిచిన యాదాద్రి జిల్లా పోచంపల్లి గ్రామంలో విచారిస్తే బిగ్ బ్రదర్ అనుచరుడేనని ధ్రువీకరించారు.
ముఖ్యంగా కేవలం 12.01 ఎకరాలే కాదు.. కొన్నిరోజుల కిందట మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఆస్తులపై ఏసీబీ దాడుల పరంపరంలోనూ మెరుగు గోపాల్ పేరు తెరపైకి రావడం గమనార్హం. సదరు వంశీమోహన్‌కు ఏకంగా 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్‌గా వచ్చిన లేఅవుట్‌ను రూపొందించిన వ్యక్తి ఈ మెరుగు గోపాల్‌గా తేలింది. అయితే ఆ లేఅవుట్ వెనుకా ఇలాంటిదే కాకపోతే భారీ భూదందా దాగి ఉన్నట్టుగా తెలుస్తున్నది.
2018-19, 2019-20, 2020-21 పహాణీల్లో సర్వేనంబరు 44లోని భూముల వివరాలు..
12 ఎకరాలను ధారాదత్తం చేసిన తర్వాత పహాణీలో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో వ్యవసాయేతర భూముల్లోని నిషేధిత జాబితాను పరిశీలిస్తే.. 44/1లో 8.39 ఎకరాలు గృహాలు, 44/2లో 4.25 ఎకరాలు కోర్టు వివాదం, 44/3లో ఎకరం భూమి తొర్రూర్-హయత్‌నగర్ జడ్పీ రోడ్డుగా నమోదై ఉన్నది.
