హైదరాబాద్ : ఇంజినీరింగ్ సహా రాష్ట్రంలోని వృత్తి విద్యాకోర్సుల ఫీజుల సవరణపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ అథారిటీ (టీఏఎఫ్ఆర్సీ) సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యాసంవత్సరం ఫీజులను పెంచొద్దని, గతేడాది ఫీజులను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం టీఏఎఫ్ఆర్సీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
చైర్మన్ జస్టిస్ స్వరూప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫీజుల సవరణ ప్రతిపాదనలపై ఈ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఫీజుల పెంపు సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తంగా ఫీజుల పెంపుపై పునరాలోచించిన సభ్యులు, తల్లిదండ్రులపై భారం మోపవద్దని భావించి ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని నిర్ణయించారు. ఫీజులపై టీఏఎఫ్ఆర్సీ నిర్ణయమే ఫైనల్ కావడంతో విద్యార్థులకు ఊరట కలుగనున్నది.
గతేడాది మెడికల్ ఫీజులను సైతం సవరించాల్సి ఉండగా, కరోనాతో ఏడాది పాటు మినహాయించారు. ఇదే పద్ధతిలో వృత్తివిద్యాకోర్సుల ఫీజుల పెంపును వాయిదావేశారు. దీంతో 3 లక్షల వరకు గ్రామీణ, నిరుపేద విద్యార్థులకు ఊరట లభించనున్నది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో జీవో జారీఅయ్యే అవకాశాలున్నాయి. పాత ఫీజుల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి, సీట్లను భర్తీ చేయనున్నారు.