Engineering Fees | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజుల మోత మోగనున్నది. భారీగా ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ట్యూషన్ ఫీజుల పెంపునకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) చేపట్టిన కసరత్తు చివరిదశకు చేరింది. ఇప్పటికే కాలేజీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన టీఏఎఫ్ఆర్సీ మంగళవారం నుంచి కాలేజీల వారీగా విచారణ చేపట్టనున్నది. మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో రోజుకు 19-20 కాలేజీల ఫీజులపై విచారించనున్నది. సాధారణంగా ఇంజినీరింగ్ కోర్సుల ట్యూషన్ ఫీజులను మూడేండ్లకోసారి పెంచుతున్నారు. చివరగా 2022-23లో పెంచగా.. 2024-25 విద్యాసంవత్సరంతో గడువు ముగిసింది. 2025-28 బ్లాక్ పీరియడ్‌కు ఫీజులు పెంచేందుకు టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు స్వీకరించగా, రాష్ట్రంలోని 163 కాలేజీలు ఫీజుల సవరణకు దరఖాస్తు చేసుకోగా, 19 కాలేజీలు చేసుకోలేదు.
ఫీజుల సవరణపై టీఏఎఫ్ఆర్సీ మంగళవారం 19 కాలేజీలను విచారించనున్నది. వీటిలో అనురాగ్, అరోరా, అవంతి, బీవీ రాజు, ఏవీఎన్, బాలాజీ, మహావీర్, అబ్దుల్ కలాం, ఏస్, ఐజా, అన్నమాచార్య, అనుబోస్, అర్జున్ తదితర కాలేజీలు ఉన్నాయి. ఈ నెల 27న, మార్చి 1, 4, 5, 7, 8, 10 తేదీల్లో రోజుకు కొన్ని కాలేజీల చొప్పున విచారించనున్నారు. కాలేజీలు సమర్పించిన ఆదాయం, ఖర్చుల ఆధారంగా ఆడిటర్లు కాలేజీలను విచారిస్తారు.