హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): మహిళలు, బాలికల వైద్యం, విద్య, ఆర్థిక తదితర అంశాల్లో సాధికారత సాధించేందుకు సరసమైన ధరలకు నూతన ఆవిష్కరణలను రూపొందించేందుకు కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థతో టీ-వర్క్స్ ఒప్పందం కుదుర్చుకొన్నది. ఇందులో భాగంగా సంప్రదాయ పొయ్యిలు, స్టౌవ్లతోపాటు పలు ఇతర అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 వేల మంది ఇలాంటి అసమర్థ వంట పద్ధతుల ద్వారా అనారోగ్యంపాలై అకాల మరణం చెందుతున్నారు. దీనిని రూపుమాపేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు విద్యకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంత బాలికలకు ఫౌండేషన్, స్టెమ్ లెర్నింగ్‌ను అందుబాటులోకి తేనున్నారు. సులభంగా విద్యను అభ్యసించేందుకు శాస్త్రీయ నమూనాలు, ప్రయోగశాల సెటప్‌తో మొబైల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
రాబోయే మూడేండ్లలో ఈ నమూనాలను పూర్తిస్థాయిలో అమలయ్యేలా తగిన చర్యలు తీసుకోనున్నారు. టీ-వర్క్స్.. స్టార్టప్‌లు, ఎస్ఎంఈలు, కార్పొరేట్‌కు నూతన తరం ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందించేందుకు, అట్టడుగున ఉన్నవారి జీవితాల్లో సానుకూల మార్పు తెచ్చేందుకు కృషిచేస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని ప్రభావిత వర్గాలన్నింటికీ తమ ఆవిష్కరణల ప్రతిఫలాలు అందేలా కేర్ ఇండియా భాగస్వామ్యం దోహదం చేస్తుందని టీ-వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురి పేర్కొన్నారు.