స్నాప్‌చాట్- 16 బిలియన్ డాలర్లు, ఆస్కార్-1.7 బిలియన్ డాలర్లు, జెట్-1.4 బిలియన్ డాలర్లు, డ్రాఫ్ట్కింగ్ -1.2 బిలియన్ డాలర్లు, అప్టేక్ – 1.1 బిలియన్ డాలర్లు అంతర్జాతీయ స్థాయిలో ఇవి..
స్విగ్గీ -5 బిలియన్ డాలర్లు, ఉడాన్- 3.1 బిలియన్ డాలర్లుక్రెడ్- 2.2 బిలియన్ డాలర్లుమీషో-2.1 బిలియన్ డాలర్లు ఓయో- 2 బిలియన్ డాలర్లు మనదేశంలో ఇవి..
స్టార్టప్‌లకు అత్యంత అనుకూల వాతావరణం
స్టార్టప్‌లు సాఫీగా కార్యకలాపాలను నిర్వహించేందుకు అనుకూల వాతావరణాన్ని టీ హబ్ నిరంతరం అభివృద్ధి చేస్తున్నది. వివిధ రంగాల నిపుణులు, దేశ విదేశీ ప్రతినిధులతో కలిపి స్టార్టప్ ప్రోత్సాహక
కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
-ఎంఎస్ రావు, సీఈవో, టీహబ్
ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఇన్నోవేషన్ నెట్వర్క్
టీ హబ్ గుర్తించిన ప్రాధాన్య టెక్నాలజీలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్/వీఆర్ (ఆగ్మెంటెండ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ), అటానమస్ మొబిలిటీ, ఆటోమోటివ్ రిమోట్ డయాగ్నోస్టిక్స్, ఆటోమోటివ్ సర్వీసింగ్ ఎఫిషియన్సీ, బిగ్ డాటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మొబిలిటీ యాజ్ ఏ సర్వీస్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, హెచ్ఆర్ టెక్, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్, ఎంటర్ప్రైజ్, అగ్రిటెక్.
అనామకంగా మొదలై ఆకాశమంత ఎదిగిన స్టార్టప్‌లు ఇవి. ఇది స్టార్టప్‌ల యుగం.. ఈ సంస్థలే అందుకు సాక్ష్యం. సింగిల్ రూం ఆఫీసులతో ప్రారంభమై వేలు.. లక్షలకోట్ల టర్నోవర్ సాధించి దిగ్గజాలుగా వెలుగొందుతున్నాయి. మరి గొప్పగొప్ప స్టార్టప్‌ల ఆవిష్కరణలో మనమెక్కడ? ఎనిమిదేండ్ల క్రితం ఈ ప్రశ్న వేసుకొన్నాడో నాయకుడు. దానికి సమాధానం.. నేడు స్టార్టప్ ప్రపంచంలో హైదరాబాద్ మహానగరానికి సుస్థిర స్థానం.
భారతదేశంలో స్టార్టప్ ఫ్యాక్టరీ అంటే నేడు టక్కున గుర్తొచ్చేది టీ హబ్. ఒకనాడు ఐటీకి రాజధానిగా ఉన్న బెంగళూరు.. స్టార్టప్‌లకూ నెలవుగా ఉండేది. 7 ఏండ్లు తిరిగేసరికి స్టార్టప్‌ల ప్రారంభంతోపాటు ఆఫీస్ స్పేస్‌లోనూ హైదరాబాద్ టాప్కు దూసుకెళ్లింది. గడ్డి నుంచి గగనం వరకు మీ బుర్రలో మొలిచిన కొంగొత్త ఆలోచన ఏదైనా.. ఇక్కడ దానికి వాస్తవ రూపం లభిస్తుంది. మీ కలల సౌధం కండ్లముందే నిర్మాణమవుతుంది. ఏడేండ్ల టీ హబ్ విజయ ప్రస్థానంపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
(గుండాల కృష్ణ )
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): అంకురం.. అంటే మొలక.. చిన్న విత్తనం మొలకై, మొక్కై, మానుగా మారుతుంది. వ్యాపార ప్రపంచంలోనూ నేడు అదే జరుగుతున్నది. స్టార్టప్.. టెక్, వ్యాపార ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ.. నాలుగు గోడల మధ్య అనామకంగా మొదలైన అనేక స్టార్టప్‌లు నేడు ప్రపంచాన్ని ఏలుతున్నాయి. మరి అలాంటి అంకురాలు ఏపుగా ఎదిగేందుకు ఒక సారవంతమైన నేల కావాలి.. అవును.. ఆ సారవంతమైన నేలే టీ హబ్.. ఏడేండ్లనాడు సాధారణంగా మొదలై.. నేడు ప్రపంచంలోనే స్టార్టప్ రంగంలో తెలంగాణకు ఓ సుస్థిర స్థానాన్ని తెచ్చిపెట్టిన కేంద్రం.
కేటీఆర్ మదిలో మొలచిన అంకురం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకూ స్టార్టప్ అంటే తెలుగు ప్రజలకు పెద్దగా తెలియదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో కే తారకరామారావు.. హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీలను సందర్శించారు. హైదరాబాద్‌ను అభివృద్ధిలో, సాంకేతికతలో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాలంటే ఏం చేయాలని అక్కడి నిపుణులను అడిగారు. దానికి వారంతా చెప్పిన సమాధానం ఒక్కటే.. హైదరాబాద్‌ను స్టార్టప్‌లకు వేదికగా మార్చటం. స్వతహాగా టెకీ అయిన మంత్రి కేటీఆర్ వెంటనే ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు. అలా పుట్టుకొచ్చిందే టీ హబ్. నేడు స్టార్టప్ ప్రపంచానికి టీ హబ్ అతి ప్రధాన కేంద్రం. నిత్యం కొత్త ఆలోచనల సాగుతో బంగారు పంటలు పండిస్తున్న మాగాణం.
భారత్‌ను ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలపాలంటే ఆవిషరణ (ఇన్నోవేషన్), మౌలిక సదుపాయాలు (ఇన్ఫ్రాస్ట్రక్చర్), సమ్మిళిత వృద్ధి (ఇన్‌క్లూజివ్ గ్రోత్) అనే మూడు (త్రీఐ) సూత్రాలు అమలు చేయాలని మంత్రి కేటీఆర్ నిత్యం చెప్తుంటారు. ఇందులో భాగంగా 2015, నవంబర్ 5న టీ-హబ్‌ను ప్రారంభించారు. తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ (నల్సార్) యూనివర్సిటీ ఆఫ్ లా వంటి సంస్థలతో కలిసి తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌ను ప్రారంభించింది.
సకల ఆలోచనల సమాగమం
స్టార్టప్‌లు అంటే టెక్నాలజీకి సంబంధించిన అంశాలకే పరిమితం కాదు. సమాజంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు ప్రారంభించే సంస్థ ఏదైనా స్టార్టపే. అలా చక్కని ఆలోచనతో ముందుకు వచ్చిన వారిని వెన్నుతట్టి ప్రోత్సహించే వేదికే టీ హబ్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కడ? ఎలా వాడాలో తెలిపేందుకు ఆయా రంగాలకు చెందిన 65 మంది నిపుణులు ఇందులో మార్గదర్శకులుగా ఉన్నారు. తెలంగాణ పల్లె దేశ విదేశాల నుంచి సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేవారిని టీ-హబ్ అక్కున చేర్చుకొంటున్నది. దాని ఫలితంగానే దేశ విదేశాల్లో స్టార్టప్ ఎకో సిస్టంలో టీ-హబ్‌కు ప్రత్యేక స్థానం లభించింది. ఏర్పాటైన ఏడాది కాలంలోనే ఆరు అంతర్జాతీయ, ఏడు జాతీయ కార్పొరేట్ కంపెనీలతో టీ-హబ్ ఒప్పందం కుదుర్చుకొని స్టార్టప్‌లకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, పేటెంట్ వంటి అంశాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నది.
ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్
మొదటి దశలో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన టీ హబ్‌కు అనతి కాలంలోనే విశేష స్పందన వచ్చింది. టీ-హబ్ కేంద్రంగా వందల మంది స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రంగా టీ హబ్ రెండో దశను నిర్మించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన టీ-హబ్-2 ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌గా మారింది. దీన్ని 2022, జూన్ 28న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఒకేసారి రెండువేల స్టార్టప్‌లు ఒకేచోట కార్యకలాపాలు నిర్వహించుకొనేలా 5,82,689 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్‌తో సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌గా దీనిని ఏర్పాటు చేశారు.
అనుభవజ్ఞుల సారధ్యంలో
ప్రస్తుతం సుమారు 50 మంది స్టార్టప్ రంగానికి సంబంధించిన నిపుణులు టీ-హబ్‌లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. నిరంతరం విభిన్న కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రణాళికలు రూపొందించి, వాటిలో ఆయా రంగాలకు చెందిన నిపుణులతోపాటు పరిశ్రమలను సైతం భాగస్వాములను చేస్తున్నారు. 2022లో రెనాల్ట్ నిస్సాన్ కంపెనీ భాగస్వామ్యంతో ఆటోమొబైల్ విభాగంలో రెనాల్ట్ నిస్సాన్ ఓపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్ పేరుతో స్టార్టప్ ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు. మారుతి సుజుకీ కంపెనీతో కలిసి మొబిలిటీ చాలెంజ్‌ను చేపట్టారు. ఇలా ఇతర రంగాలకు సంబంధించి పలు స్టార్టప్ ప్రోత్సాహక కార్యక్రమాలు టీ-హబ్ వేదికగా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి.ప్రారంభ దశలో ఉన్న టెక్నాలజీ స్టార్టప్‌ల కోసం టీ-హబ్‌లో రుబ్రిక్స్ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రొటోటైప్ దశ నుంచి మినిమమ్ వయబుల్ ప్రాడక్టు దశ (ఎంవీపీ) వరకు అవసరమైన సహకారాలు అందిస్తున్నారు. ఐదు నెలల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ఆలోచన దశ నుంచి ఉత్పత్తుల వరకు నిపుణులు పని చేస్తారు. ఫిన్‌టెక్, సస్టెయినబిలిటీ, హెల్త్‌టెక్, హెచ్ఆర్ టెక్, మొబిలిటీ, ఐఓటీ, ఎంబెడ్డెడ్ సిస్టం, ఎంటర్ప్రైజ్, అగ్రిటెక్ రంగాల్లోని స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు సహాకారం అందించేందుకు ల్యాబ్-32 పేరుతో కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్టార్టప్ కమ్యూనిటీలో విశేష అనుభవం ఉన్న నిపుణులతో కమ్యూనిటీ కనెక్ట్ పేరుతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. స్టార్టప్‌లకు మెంటార్షిప్ చేసేవారు ఇందులో పాల్గొని అనుభవనాలను పంచుకుంటారు.
పాలసీలు ఇన్నోవేషన్
టీ-హబ్ ద్వారా మార్కెట్ యాక్సెస్ ఇలా
స్టార్టప్‌లకు
అండగా కార్పొరేట్ కంపెనీలుస్టార్టప్లకు సహకరించేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 48 కార్పొరేట్ సంస్థలు టీ-హబ్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో భాగస్వాములయ్యాయి.
కార్పొరేట్ కంపెనీలతో టీ-హబ్ భాగస్వామ్యాలు ఇలా…
గగనంలో ఘన విజయం
అంతరిక్షం అనగానే మనకు గుర్తొచ్చేవి శాటిలైట్లు, రాకెట్లు. ఆ రంగంలో పని చేసేవారు తప్ప సాధారణ వ్యక్తులు వాటిని టీవీలు, సినిమాల్లో చూడటం తప్ప నేరుగా చూసే అవకాశం చాలా తక్కువ. కానీ హైదరాబాద్ మహానగరంలో మున్ముందు శాటిలైట్లు, రాకెట్లు అనేవి సర్వ సాధారణం కానున్నాయి. అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న హైదరాబాద్, అంతరిక్ష రంగంలోనూ దూసుకుపోతున్నది. టీ-హబ్ వేదికగా పురుడుపోసుకొన్న రెండు స్టార్టప్‌లు ఇప్పటికే స్పేస్ రంగంలో సత్తా చాటాయి. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు కానున్న ‘సమీకృత రాకెట్ తయారీ కేంద్రం’తో ఈ నగరం శాటిలైట్-రాకెట్లకు కేంద్రంగా మారనున్నది. ప్రస్తుతం పది బిలియన్ డాలర్ల వరకు ఉన్న రాకెట్ లాంచింగ్ మార్కెట్, 2025-26 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుకొంటుందని అంచనా.
ఈ రంగంలో టీ-హబ్ కేంద్ర బిందువుగా మారనున్నదని నిపుణులు చెప్తున్నారు. ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నెలకు ఐదు శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెడుతున్నది. ఇదే రీతిన సమీప భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో కూడా ప్రైవేటు సంస్థలు శాటిలైట్లు తయారుచేసి స్పేస్‌లోకి పంపే సమయం సమీపంలో ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.
టీ హబ్‌లో ప్రోత్సాహక కార్యక్రమాలు
సినీ ప్రెన్యూర్- మీడియా టెక్, రెనాల్ట్ నిస్సాన్ ఓపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్ – ఆటోమొబైల్, రూబ్రిక్స్, మాస్టర్ క్లాసెస్, కాన్‌ప్లుయెన్స్, సిటీ బ్యాంక్ సోషల్ ఇన్నోవేషన్ ల్యాబ్ – ఫిన్‌టెక్, ల్యాబ్ 32, అటల్ ఇన్నోవేషన్ సెంటర్, టీ ఏంజిల్, డిస్క్ 5, మొబిలిటీ చాలెంజ్, కాలేజీల్లో లాంచ్పాడ్, కిక్‌స్టార్ట్, టీ-కనెక్ట్, బోయింగ్ బిల్డ్ 2.0, డ్రోన్ టెక్ విత్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇండియా-యుకే వీఆర్ కన్సార్టియం.
స్టార్టప్‌లకు అత్యంత అనుకూల వాతావరణం
స్టార్టప్‌లు సాఫీగా కార్యకలాపాలను నిర్వహించేందుకు అనుకూల వాతావరణం అవసరం. దాన్ని అభివృద్ధి చేసే పనిని నిరంతరం టీ హబ్ చేస్తున్నది. వివిధ రంగాల నిపుణులతో పాటు దేశ విదేశీ ప్రతినిధులతో కలిపి స్టార్టప్ ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కళాశాలల్లో సైతం స్టార్టప్‌ల కార్యలాపాల కోసం లాంచ్‌ప్యాడ్, కిక్స్టార్ట్లను చేపట్టాం. ఇటీవలే కార్పొరేట్ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌ను ఢిల్లీ, బెంగళూరు, చెన్నైల్లో నిర్వహించాం. ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలను రూపొందించి అమలు చేస్తున్నాం. 2022లో నిర్వహించిన 7వ వార్షికోత్సవం సందర్భంగా కొత్తగా 6 ఎం/2 పీ సూత్రాన్ని అమలు చేస్తున్నాం.
– ఎంఎస్ రావు, సీఈవో, టీహబ్
6ఎం/2పీ సూత్రం
స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్ సరికొత్త విధానాలను అమలు చేస్తున్నది. 2022లో 7వ వార్షికోత్సవం సందర్భంగా 6ఎం/2పీ సూత్రాన్ని అమల్లోకి తెచ్చారు. 6 ఎం అంటే మనీ, మెథడాలజీస్, మార్కెట్ యాక్సెస్, మెంటార్షిప్, మోటివేషన్, మ్యాన్‌పవర్. 2పీ అంటే పార్టనర్షిప్, పాలసీ అడ్వైజరీ.
దరఖాస్తు ఇలా
ఆలోచన ఉంటే చాలు.. టీ హబ్‌లో అడుగు పెట్టేందుకు అవకాశం కలుగుతుంది. మీ ఐడియాను నిపుణుల సమక్షంలో 2-3 నిమిషాల్లో పిచ్ (సంక్షిప్తంగా చెప్పగలగడం) చేయగలగాలి. సమస్యను పరిష్కరించేందుకు మీరు ఎంచుకున్న సాంకేతిక పరిజ్ఞానం, సమస్యకు ఉన్న ప్రాధాన్యం, మార్కెట్లో దానికి ఉండే అవకాశాలను నిపుణులు అంచనా వేస్తారు. ఆ ఐడియాతో స్టార్టప్‌ను ప్రారంభించవచ్చో లేదో తేల్చేస్తారు. ప్రాంతంతో సంబంధం లేకుండా ఎవరైనా మంచి ఆలోచనతో వస్తే ఆవిష్కరణలతో వెళ్లేలా టీ హబ్‌లో ఎకో సిస్టంను అందుబాటులో ఉంచారు.