T Hub | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): ఏరోస్పేస్ రంగంలో మన స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకుగాను ఈ రంగం లో ప్రపంచ దిగ్గజ సంస్థగా ఉన్న కొలిన్స్ ఏరోస్పేస్తో టీహబ్ జట్టుకట్టింది. దేశంలో అతి పెద్ద ఇన్నోవేషన్స్ ఇంక్యుబేటర్ అయిన టీహబ్‌లో ఏరోస్పేస్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా ఏరోస్పేస్ రంగంలోని స్టార్టప్‌లకు కొలిన్స్ సంస్థ నిధులు సమకూర్చడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ప్రోత్సహించనున్నది. మన స్టార్టప్‌లు ప్రపంచ స్థాయి సంస్థలుగా ఎదిగేందుకు, వాటి కార్యకలాపాలు విస్తరించేలా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టీ హబ్ సీఈఓ ఎంఎస్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఏరోస్పేస్ రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న కొలిన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. వివిధ రంగాలకు ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ‘కార్పొరేట్ కనెక్ట్’ పేరుతో ప్రముఖ సంస్థలతో టీ హబ్ ఒప్పందాలు కుదుర్చుకుంటూ స్టార్టప్‌లకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నదని ఆయన తెలిపారు.
భారత్‌లోని స్టార్టప్ వ్యవస్థలో టీ హబ్‌కు ఉన్న ప్రత్యేకత, పేరును గుర్తించి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు కొలిన్స్ ఏరోస్పేస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మేరీ లాంబార్డో పేర్కొన్నారు. భారత్, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు తాము అక్కడి ఇంక్యుబేటర్లతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సహకారం భారతీయ స్టార్టప్‌లకు వాటి సామర్థ్యాలను ప్రదర్శించడానికి, ఏరోస్పేస్ టెక్నాలజీ భవిష్యత్తుకు దోహదపడేందుకు ఒక అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు.