నది పునరుజ్జీవం అంటే దానిని ఆసాంతం కాపాడటం. ఓ వైపు మూసీ పునరుజ్జీవం గురించి గొప్పగా చెప్తూ.. మరోవైపు నది జన్మస్థానాన్ని ప్రమాదంలో పడేయడం ఏమిటి? నది పునరుజ్జీవమంటే గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లేలా పార్కులు నిర్మించడం కాదు. స్వచ్ఛమైన నీరు, చేపలు, ఇతర జంతువులతో జల, జీవవైవిధ్యాన్ని కాపాడటం.
Radar | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రా డార్ స్టేషన్‌ను నిర్మిస్తే తెలంగాణ జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అనంతగిరి, ఆదిలాబాద్, నల్లమలలో మాత్రమే జీవవైవిధ్యం సంపన్నంగా ఉన్నదని తెలిపారు. రాడార్ స్టేషన్ కోసం 2,900 ఎకరాల అడవిని ధ్వంసం చేస్తే మూసీ నది ఉనికికే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. శుక్రవారం సోమాజీగూడలో పర్యావరణ వేత్తలు పురుషోత్తంరెడ్డి , బీవీ సుబ్బరావు, దొంతి నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడారు. దొంతి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. రాడార్ స్టేషన్ అనుమతులను వెంటనే రద్దు చేసి, మూసీ నది పుట్టిన అనంతగిరి అడవులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఫార్మా, డిస్టిలరీ, టెక్స్టైల్ డైయింగ్ పరిశ్రమల వల్ల మూసీనది విపరీతంగా కలుషితమైందని ఆవేదన వ్యక్తంచేశారు. రాడార్‌ను దామగుండంలోనే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రాడార్ ఏర్పాటుకు దేశంలో 12 ప్రాంతాలను పరిశీలించాలని ప్రతిపాదనలున్నాయని, అన్నింటినీ వదిలేసి దామగుండంలో పర్యవరణాన్ని దెబ్బతీయడం సరికాదని అన్నారు. దామగుండంలో నేవీ ప్రతిపాదించిన రాడార్ స్టేషన్ 2010 నాటిదని, గత 14 ఏండ్లలో టెక్నాలజీ ఎంతో మారిపోయిందని చెప్పారు. కాబట్టి కాలంచెల్లిన సాంకేతిక పరికరాల కోసం అటవీ భూములు అప్పగించడం సరికాదని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు రూపొందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఫార్మాసిటీ వద్దన్నదని, ఇప్పుడు పేరుమార్చి అమలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక శ్వేతపత్రాలు విడుదల చేసిందని, అదే తరహాలో దామగుండంపైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాడార్ స్టేషన్ కోసం దామగుండం అడవిని ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించొద్దని బీవీ సుబ్బరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేవీ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చే రూ.130 కోట్లు కావాలో, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కావాలో నిర్ణయించుకోవాలని తేల్చి చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే పర్యావరణవేత్తలతో చర్చలు జరపాలని, తమ అభ్యంతరాలను స్వీకరించాలని కోరారు. ఈ సమస్య 2,900 ఎకరాల భూమికి సంబంధించినది మాత్రమే కాదని.. గాలి, నీరు, జీవవైవిధ్యం ఇలా అనేక అంశాలు దీనిలో ముడిపడి ఉన్నాయని తెలిపారు. లక్షల చెట్లను తొలిగించడం వల్ల జంట జలాశయాలకు వరద ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరించారు. ఓవైపు మూసీ నది పునరుజ్జీవం గురించి ప్రభుత్వం గొప్పగా చెప్తూ, మరోవైపు ఆ నది జన్మస్థానాన్ని ప్రమాదంలో పడేయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక నదిని పునరుద్ధరించాలంటే కొన్ని కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కాదని, నది పుట్టిన స్థానం నుంచి సముద్రంలో కలిసే ప్రాంతం వరకు దృష్టిపెట్టాల్సి ఉంటుందని చెప్పారు. ‘నదిని పునరుద్ధరించడం అంటే గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లేలా పార్కులు నిర్మించడం కాదు. స్వచ్ఛమైన నీరు, చేపలు, ఇతర జంతువులతో జల జీవవైవిధ్యాన్ని కాపాడటం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు అటవీ భూముల అప్పగింతకు సంతకాలు చేసిన చేత్తోనే శుక్రవారం చిత్తడి నేలల దినాన్ని నిర్వహించారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఒడిశాలో సహజ జలపాతాల అభివృద్ధికి రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నదని, అదే సమయంలో నదులు పుట్టిన దామగుండంలో అడవులను నరికివేస్తున్నదని మండిపడ్డారు.
గంగ, యమున నదులు పుట్టిన ప్రాంతాల్లో పూజలు చేసి పాపాలు కడుక్కుంటున్నప్పుడు మూసీ పుట్టిన ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని, ప్రజలను ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి ప్రశ్నించారు. గంగానది పుట్టిన ప్రాంతం చుట్టూ 150 కిలోమీటర్ల వరకు ‘ఎకో సెన్సిటివ్ జోన్’గా ప్రకటించి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పర్యావరణ పరిరక్షణ కమిటీని (ఈపీఏ) ఏర్పాటు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక పర్యావరణాన్ని విధ్వంసం చేసే ఒప్పందాలపై సంతకాలు చేసిందని విమర్శించారు. వెంటనే రాష్ట్ర స్థాయిలో ఈపీఏ ఏర్పాటు చేయాలని, దామగుండం భూములను ఎందుకు నేవీకి అప్పగిస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనంతగిరి, నల్లమల, ఆదిలాబాద్ అడవుల్లో మాత్రమే జీవవైవిధ్యం ఉన్నదని, అలాంటి అడవులను రాడార్ స్టేషన్ కోసం తీవ్ర సమస్యలు వస్తాయని తెలిపారు. వెంటనే నేవీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.