హైదరాబాద్ సిటీబ్యూరో/పీర్జాదిగూడ, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్త చేతిలో అతిదారుణంగా హత్యకు గురైన స్వాతి(21) శరీర భాగాల కోసం రెండోరోజు మేడిపల్లి పోలీసులు మూసీలో విస్తృతంగా గాలించారు. మరో పక్క స్వాతి మొత్తం శరీర భాగాలు లభించిన తర్వాతే గాంధీ దవాఖానలో ఉన్న ఆమె మొండెం స్వాధీనం చేసుకుంటామని, అంత్యక్రియలు ఆమె భర్త కుటుంబీకులే చేయాలంటూ స్వాతి కుటుంబీకులు భీష్మించారు. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు స్వాతి మృతదేహాన్ని అప్పగించే విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మహేందర్‌రెడ్డి స్వగ్రామంలోని అతడి ఇంటి ఎదుట స్వాతి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. స్వాతిని కిరాతంగా హతమార్చిన మహేందర్‌రెడ్డి, అతడి కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఆదివారం స్వాధీనం స్వాతి మొండెంను గాంధీ దవాఖానకు తరలించిన పోలీసులు.. పోస్టుమార్టం నిర్వహించి, డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. ఆ తర్వాత ఆమె మొండెంను గాంధీ దవాఖాన నుంచి స్వాధీనం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. మేడిపల్లి పోలీసులు, గ్రామ పెద్దలు స్వాతి కుటుంబ సభ్యులతో మాట్లాడి అప్పగించారు. మహేందర్‌ను కోర్టులో హాజరుపర్చి జైలుకు పంపారు.
తాగడానికి డబ్బులు ఇవ్వలేదని..భార్యను హతమార్చిన భర్త ; మహబూబ్‌నగర్ జిల్లా బైరంపల్లిలో విషాదం
మిడ్జిల్, ఆగస్టు 25: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్యపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన ఘటన సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా భైరంపల్లిలో జరిగింది. బైరంపల్లికి చెందిన బుచ్చయ్య, బాలమణి (40) దంపతులు. కొద్దిరోజుల కిందట వీరి కుమారుడు గణేశ్ చనిపోయాడు. బుచ్చయ్య తాగుడుకు బానిసై తరచూ భార్యతో గొడపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం బుచ్చయ్య ఇంటికొచ్చి తాగడానికి డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. డబ్బులు లేవని ఆమె తెలిపింది. ఆగ్రహంతో ఉన్న బుచ్చయ్య.. కాసేపటికి నిద్రపోయిన బాలమణిపై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలమణి మృతదేహాన్ని మహబూబ్‌నగర్ దవాఖానలోని మార్చురీకి తరలించారు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. బుచ్చయ్యను అదుపులోకి తీసుకున్నారు.