హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): భగవంతుడే జాతి జీవన సూత్రమని, ఇదే ప్రపంచ నాగరికతకు ఆధారమని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ అధ్యక్షుడు స్వామి చిదానందగిరి తెలిపారు. హైదరాబాద్ కన్హా ఆశ్రమంలో ఈ నెల 16 వరకు నిర్వహించే యోగదా సత్సంగ సొసైటీ (వైఎస్ఎస్) కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ, మాన వ జాతికి ఒక భద్రమైన, సమృద్ధమైన, ఆనందమయమైన భవిష్యత్తు కావాలంటే ఈ చైతన్యాన్ని ప్రపంచ మానవులందరిలో నెలకొల్పాలని సూచించారు. భక్తులంతా.. సనాతన భారతీయ ఆధ్యాత్మిక నాగరికతకు, రాబోయే ఏక ప్రపంచ ఆధ్యాత్మిక నాగరికతకు మధ్య వారధులవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఉపాధ్యక్షుడు స్వామి విశ్వానందగిరి, వైఎస్ఎస్ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానందగిరి పాల్గొన్నారు.